సరైన సినిమా పడితే కలెక్షన్స్ కు లోటు ఉండదని చాలా సార్లు చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని రుజువు చేయటానికి అన్నట్లుగా ‘వార్‌’ సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌, యాక్షన్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘వార్‌’. భారీ బడ్జెట్‌,  అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.  ఆ అంచనాలను అందుకోవటంలో సినిమా సక్సెస్ అవటంతో కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది.

కేవలం వారం రోజుల్లోనే ఇండియాలో నెట్‌ వసూళ్లు రెండు వందల కోట్లు వచ్చి ట్రేడ్ లో రికార్డ్ క్రియేట్ చేసిందీ చిత్రం. ఇంత స్పీడుగా రెండు వందల కోట్ల మార్కుకి రీచ్‌ అయిన సినిమా ఈ ఏడాదిలో మరోటి లేదు. తెరపై హృతిక్‌ బీభత్సం చేసాడని ఫ్యాన్స్ మురిసిపోయి రిపీట్ గా చూస్తున్నారు. ఈ సంవత్సరం లో ఇంతవరకు బాలీవుడ్‌ నుంచి మూడు వందల కోట్ల నెట్‌ వసూలు చేసిన సినిమా రాలేదు. ఆ లోటుని వార్‌ తీర్చేయనుందని అర్దమవుతోంది. ఈ సినిమా హృతిక్‌ రోషన్‌ కు  తొలి రెండు వందల కోట్ల చిత్రమే కాకుండా, మూడు వందల క్లబ్‌లో కూడా అతనికి చోటు ఇవ్వనుంది.
 
‘సూపర్‌ 30’సక్సెస్  తర్వాత హృతిక్‌ నటించిన చిత్రమిది.ఈ సినిమాలోనూ ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫైట్ సీన్స్ లో  హృతిక్‌, టైగర్‌ దుమ్ము దులిపారు. రిస్కీ ఫైట్లను సునాయసంగా చేసేయటంతో ఫ్యాన్స్ కు పండగగా మారింది.  కొన్ని యాక్షన్‌ సీన్స్  హలీవుడ్‌ చిత్రాలను తలపించాయి. ‘మిషన్‌ ఇంపాజిబుల్’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ చిత్రాల్లోని సీన్స్  స్థాయిలో కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం  సినిమాకి కొత్తఫీల్‌ను తీసుకొచ్చింది.