కరోనా భయంతో ఇంటికే పరిమితమైన తారలు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సౌత్ సినిమాలో నటించిన విదేశీ భామ అమీ జాక్సన్‌ ఓ ఇంట్రస్టింగ్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హోం క్యారెంటైన్‌లో ఉన్న ఈ బ్యూటీ తనదైన స్టైల్‌ లో కాస్త డిఫరెంట్‌గా వర్క్ అవుట్స్‌ చేసింది. ప్రస్తుతం జిమ్‌ లు కూడా మూసీ వేయటంతో బాడీ ఫిట్‌ నెస్‌ విషయంలో హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆ ఇబ్బందులకు సమాధానంగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్‌ పేజ్‌ లో పోస్ట్ చేసింది బ్రిటీష్ బ్యూటీ. బాత్‌ రూంలో వాడే టాయిలెట్‌ పేపర్‌తో ఇంట్రస్టింగ్ వర్క్ అవుట్ వీడియోను పోస్ట్ చేసింది. 28 ఏళ్ల ఈ భామ స్పోర్ట్స్ వేర్‌లో తన కొడుకుతో కలిసి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియోతో పాటు `వర్క్ అవుట్‌ చేసేప్పుడు జిమ్‌ అవుట్‌ ఫిట్ వాడండి లేదంటే మీరు అందంగా కనిపించరు. ఈ వర్క్‌ అవుట్ కోసం మీకు ఓ స్పెషల్ ఐటమ్ కావాలి. మీరు టాయిలెట్‌ లో వాడే రోల్‌ను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నేనెలా వర్క్ అవుట్ చేస్తున్నానో చూడండి` అంటూ కామెంట్ చేసింది అమీ జాక్సన్‌.

2010లో రిలీజ్‌ అయిన మదరాసీ పట్టణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అమీ, తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో ఎవడు సినిమాలో కీలక పాత్రలో నటించిన అమీ.. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఐ, 2.ఓ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.