టెక్నాలజీ అందుబాటులో ఉంటే కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. కొందరు సాంకేతికతను మంచి కోసం ఉపయోగిస్తుంటే.... మరి కొందరు మాత్రం తమ స్వార్థం కోసం.. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఓ యువతి కూడా అదే చేసింది. స్కూల్ ప్రిన్సిపల్స్ ని టార్గెట్ చేసుకొని కేవలం నెల రోజుల్లో రూ.లక్షలు గుంజేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సదరు యువతి పేరు నేహా ఫాతిమా. సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఈమె బీఎస్సీ కంప్యూటర్స్ చదివింది. అక్రమంగా లక్షలు సంపాదించాలని అనుకుంది. అందులో భాగంగానే... టెక్నాలజీని వాడుకుంది. బడా పాఠశాలలు, కార్పొరేట్‌ స్కూళ్లు తమ విద్యార్థుల ఘనతను అధికారిక వెబ్‌సైట్లలో.. సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుంటాయి.  అలాంటి ఫొటోలనే ఈ యువతి కూడా  ఎంచుకుంది. వాటి సాయంతో బ్లాక్‌మెయిలింగ్‌కు తెరలేపింది.
 
పాఠశాలల అధికారిక వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉండే విద్యార్థినుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని, మార్ఫింగ్‌ ద్వారా అశ్లీల చిత్రాలతో జతచేస్తుంది. సదరు విద్యార్థిని చదివే స్కూల్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచి, అశ్లీల చిత్రాలన్నింటినీ అప్‌లోడ్‌ చేస్తుంది. వెంటనే.. సంబంధిత స్కూల్‌ యాజమాన్యానికి సమాచారం అందిస్తుంది. షాక్‌కు గురయ్యే ప్రిన్సిపాళ్లకు నేహా ఓ పరిష్కారాన్ని సూచిస్తుంది. తాను సైబర్‌ సెక్యూరిటీ నిపుణురాలినని, తన టీంతో కలిసి ఆ ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి, ఫొటోలు తొలగించడానికి లక్షలు డిమాండ్‌ చేస్తుంది.
 
అలా.. నెల రోజుల వ్యవధిలో 15 మంది ప్రిన్సిపాళ్ల నుంచి లక్షల రూపాయలు గుంజింది. తన మాటలను ప్రిన్సిపాళ్లు వినకుంటే.. బెదిరింపులకు దిగుతుంది. విద్యార్థిని తల్లిదండ్రులనూ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది. నేహా బాధిత ప్రిన్సిపాల్‌ ఒకరు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఐపీ అడ్రస్‌ సాయంతో నిందితురాలిని గుర్తించారు. నేహాను అరెస్టు చేశారు.