భర్తను బంధించి.... అతని కళ్లెదుటే... నలుగురు వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... నాగర్ కర్నూలు ఎనిమిల్ల తండాకు చెందిన చందు తన భార్యపిల్లలతో కలిసి కొంతకాలం క్రితం వలసగా వచ్చి మహేశ్వరం మండలం హర్షగూడలో నివసిస్తున్నాడు. కాగా... చందు తాను పనిచేసే ఫాంహౌస్  యజమానులు రంగారెడ్డి, ప్రతాప్ రెడ్డిలతో ఈ నెల 18న ఏదో విషయంపై గొడవపడ్డాడు. 

దీంతో చందుతోపాటు అతని భార్యను అదే రోజు తన ఫాంహౌస్ లో యజమానులు బంధించారు. అనంతరం అతని భార్యపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.  దీంతో అదేరోజు రాత్రి భార్యభర్తలు తమకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ కి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. నిందితుల బంధువులు వారిని ఆపి... బుజ్జగించే ప్రయత్నం చేశారు.

వారిని బలవంతంగా వారి స్వగ్రామానికి పంపించేశారు. అయితే.... తిరిగి చందు, అతని భార్య గ్రామస్థుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.