సృష్టిలో పవిత్రమైన బంధం... తల్లీబిడ్డల బంధం. అలాంటి బంధాన్ని ఓ వ్యక్తి అపహాస్యం చేశాడు. అమ్మ అని ఓ స్త్రీని పిలుస్తూనే... ఆమెపై కన్నేశాడు. ఆమెను అనుభవించాలని భావించాడు. కానీ... అతని వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకొని కన్నుమూసింది. భర్తను, కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలకు.. కేవలం ఓ కామాంధుడి కారణంగా ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కంచలి మండలంలోని మహాత్మాగాంధీ ఉపాధి హామీ కార్యాలయంలో గతంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ గా పనిచేసిన మాధవ్ కంచిలి స్టేట్ బ్యాంకు సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అనంతరం ఇంటి కిందనున్న స్థానిక ఏపీజీవీ బ్యాంకులో పనిచేస్తున్న ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న మాధవ్... వారితో స్నేహంగా మెలిగేవాడు. అలాగే పైనున్న మరో కుటుంబంతో కూడా పరిచయం పెంచుకున్నాడు.

ఓ పోర్షన్ లో ఉండే భార్యభర్తలను అమ్మ, నాన్న అంటూ... మరో పోర్షన్ లో ఉండేవారిని అక్క, బావ అంటూ పిలిచేవాడు. ఈ క్రమంలో అమ్మ అని పిలిచే వివాహిత స్నానం చేస్తున్న సమయంలో ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు. అనంతరం వాటిని ఆమెకు చూపించి తన కోరిక తీర్చాలంటూ బెదిరించేవాడు. దానికి ఆమె వ్యతిరేకించడంతో ఆ వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించేవాడు.

కొద్ది రోజుల తర్వాత మాధవ్ కి వేరే ప్రాంతానికి బదిలీ అయ్యింది. అయినా అతని వేధింపులు మాత్రం ఆగలేదు. వారం రోజుల క్రిందట మళ్లీ వివాహిత ఇంటికి వచ్చి వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు కూడా తెలియజేసింది. దీంతో ఆమె భర్త మాధవ్ కి వార్నింగ్ ఇవ్వాలని అనుకున్నాడు. అయినప్పటికీ... అతని వేధింపులు గుర్తుకు వచ్చి మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.