ఆగి ఉన్న లారీని ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలై మృతి చెందారు.  సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..... పీలేరుకు చెందిన కె. పెద్దిరెడ్డి(55), బండకిందపల్లెకు చెందిన షఫీ(45) ఇద్దరు పశువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా... శనివారం ఉదయం ఇద్దరూ కల్లూరులో జరిగే పశువుల సంతకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో కోళ్ల ఫారం గ్రామం సమీపంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద వీరి వాహనం అదుపుతప్పి... ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. 

దీంతో... తీవ్రగాయాలపాలై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పీలేరు సీఐ సాదిక్ అలీ సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.