రేపల్లె:  వైఎస్సార్‌సిపి ప్రభుత్వం నాలుగు నెలల పాలనలో ప్రజలకోసం, రాష్ట్రాభివృద్ది కోసం చేసిందేమీ లేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఇప్పటివరకు సాగిన ప్రభుత్వ పాలనపై మంత్రులు చర్చకు సిద్దమా... అంటూ ఆయన సవాల్ విసిరారు. కనీసం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు గురించి వాస్తవాలు బహిర్గతం చేసే ధైర్యంకూడా ఈ ప్రభుత్వంలోని మంత్రులకు లేదని అన్నారు. 

అభివృద్ధి, సంక్షేమం చూసి టిడిపి నేతలు ఓర్వలేకపోతున్నారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు...అంత గొప్పగా మీరు చేసిన అభివృద్ది ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మీరు ఏం చేశారో చెప్పగల ధైర్యం మంత్రులకు ఉందా...? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి సంతకం నుంచి.. నిన్నటికి నిన్న కేబినెట్‌ లో తీసుకున్న మీడియాపై ఆంక్షల వరకు ప్రతీ నిర్ణయం ప్రజా వంచన, ప్రజావ్యతిరేకంగా వుందని దుయ్యబట్టారు. ఈ అప్రజాస్వామిక పాలన చూసి మేం అసూయ పడుతున్నామా.? ఏం ఒరగబెట్టారని ఈర్శ్య పడడానికి.? అంటూ ఎద్దేవా చేశారు.

Read more కొత్త ఇసుక పాలసీ ప్రజల కోసం కాదు...వారికోసమే...: ఆలపాటి రాజేంద్రప్రసాద్‌...

మీ ప్రభుత్వం సాగించిన నాలుగు నెలల పాలనపై చర్చించేందుకు ఏ మంత్రయినా సిద్ధంగా ఉన్నారా.?  రాష్ట్రంలోని సమస్యల గురించి కాదు కనీసం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గురించిన వివరాలను అయినా బహిర్గతం చేసే ధైర్యం మంత్రులకు ఉందా.? అని సవాల్ విసిరారు.

చంద్రబాబు పాలనలో రాజధాని అమరావతి అడుగులు నేర్చుకుందన్నారు. అన్న క్యాంటీన్లు బడుగుల ఆకలి తీర్చాయని... రూ.200 నుంచి రూ.2000లకు పెంచిన పెన్షన్లు వృద్ధులకు ఆసరాగా నిలిచాయన్నారు. కానీ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అడుగులేస్తున్న అమరావతి ఆగిపోయింది. అన్నార్తుల ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. కూలీలు కూటి కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. ఇది చూశా మేం అసూయపడాలా..? ఇది చూశా మేం ఓర్వలేకపోతున్నామా..? అని ఎద్దేవా చేశారు.

Read more బంగ్లా చెరలో విశాఖ మత్స్యకారులు... కేంద్ర మంత్రి సాయం కోరిన ఎంవీవీ...

జగన్‌ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు చూసి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేక మొహం తిప్పుకుని తిరుగుతున్నారన్నారు. లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వ్యక్తి వెనకున్న మంత్రులకు... లక్షల కోట్ల సంపద సృష్టించి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా తలెత్తుకునేలా చేసిన చంద్రబాబుపై విమర్శలు అర్హత హక్కు లేదని అన్నారు.

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏంటో చెప్పడానికి  అనతికాలంలోనే ప్రపంచ ఖ్యాతిగాంచిన అమరావతి ఉందన్నారు. కానీ ఏ రోజు ఏమవుతుందో తెలియక దినదిన గండంలా రోజులు గడుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో క్విడ్‌ ప్రోకో తప్ప ఏమీ లేదన్నారు. మీ నాలుగు నెలల రివర్స్‌ పాలన చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారని విమర్శించారు. 

వైసీపీ అనైతిక చర్యలను చూసి గ్రామాల్లో మీకు నో ఎంట్రీ బోర్డులు పెట్టారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ కార్యాలయాలకు టూలెట్‌ బోర్డులు పెట్టడం ఖాయమన్నారు.  వైసీపీ పునాదులు కదులుతున్నాయనే విషయాన్ని  గ్రహించే ఆ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోకుంటే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.