నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ జ్వాలా గిరిరావు(50) ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన ఆక్ష్న గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ మీద నిజామాబాద్ రూరల్ మండలానికి వచ్చారు. అంతకముందు ఆయన హైదరాబాద్ లో కూడా పనిచేశారు. కాగా... ఆయన సడెన్ గా ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. 

జ్వాలా గిరిరావు కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుండగా, ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన భార్య శ్రీదేవి గురువారం ఉదయం ఫోన్‌ చేయగా, ఎంతకీ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్‌ ప్రవీణ్, వీఆర్వోకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో వారిద్దరూ గిరిరావు అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లి చూడగా, బెడ్ రూంలో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు.

దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తహసీల్దార్‌ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.