కర్నూలు జిల్లా సున్నిపెంట గ్రామం గ్రామ పంచాయతీగా పునః పురుడు పోసుకుంది. మంగళవారం సాయంత్రం ప్రభుత్వం  ఉత్తర్వులను విడుదల చేసింది. 2013లో గ్రామపంచాయతీ నిలిపివేస్తూ ఇచ్చిన స్టేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎత్తివేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విజయవాడలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేది ప్రిన్సిపల్ సెక్రెటరీ అటవీ శాఖ అధికారులతో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, డి పి ఓ. కే ఎల్ ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ హరిబాబు ఇరిగేషన్ అధికారులతో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సున్నిపెంట గ్రామపంచాయతీ ఏర్పాటు ఆవశ్యకత గురించి కలెక్టర్ వీరపాండియన్ వివరించారు. అలాగే గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు, ఖర్చులను వెల్లడించారు. దీనితో రాష్ట్ర స్థాయి కమిటీ సున్నిపెంట గ్రామపంచాయతీ పై ఉన్న స్టేను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.  

సుండిపెంట గ్రామపంచాయతీ గా మార్చడానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రత్యేక కృషి చేశారు ఈ విషయంలో ఇప్పటికే మూడు సార్లు జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. అలాగే పంచాయతీరాజ్, ఇరిగేషన్, రెవెన్యూ మంత్రులతో కూడా చర్చించి విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

1963లో శ్రీశైలం డ్యామ్ నిర్మాణం సమయంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిమంది కార్మికులు రోజువారీ కూలీలు శ్రీశైలం డ్యామ్ లో పనిచేసే సిబ్బందితో సున్నిపెంట గ్రామం ఏర్పడింది.