ఖమ్మం: సీనియర్ జర్నలిస్టు రాజేష్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలు తెలుగు దినపత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఓ అంతర్జాతీయ వెబ్ పోర్టల్ కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన వయస్సు 38 ఏళ్లు.

భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా అశ్వారాపుపేటకు చెందిన పెదమళ్ల రాజేష్ బుధవారం సత్తుపల్లి వెళ్లే మార్గంలో కారులో స్పృహ తప్పి కనిపించాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని తొలుత భావించారు. కారు అదుపు తప్పి పొదల్లోకి వెళ్లిందని కూడా అనుకున్నారు.

కానీ, ఆయన ఇంట్లో పురుగుల మందు తాగి కారులో బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. కారు పొదల్లో కనిపించింది. అందులో రాజేష్ కనిపించాడు. సీటు బెల్టు కూడా పెట్టుకున్నాడు. కారు అద్దాలు పగులగొట్టి అతన్ని బయటకు తీశారు. ఆయన సమయంలో ఆయన కాస్తా స్పృహలోనే ఉన్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. 

ఇంట్లో గొడవల కారణంగానే రాజేష్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆస్తుల గొడవలు ఉన్నాయని కూడా అంటున్నారు. రాజేష్ ఓ ప్రముఖ టీవీ చాలెన్ లో జర్నలిస్టుగా తన వృత్తిని ప్రారంభించారు. ఆ  తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో హైదరాబాదులోనూ ఢిల్లీలోనూ పనిచేశారు. స్వంత ఊరులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇటీవలే ఇక్కడికి వచ్చారు.