సంగారెడ్డి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికోసం తాను ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) తెలిపారు. ఆ  పదవికి తాను అన్ని విధాలుగా అర్హుడినేనని... తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీని మరింత  బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువస్తావని ఇప్పటికే డిల్లీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియాను తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇక శివరాత్రి తర్వాత తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. డిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించనున్నట్లు  తెలిపారు. అలాగే తనకు టిపిసిసి పగ్గాలు అప్పగించాలని కోరనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. 

read more  తెలంగాణ సచివాలయం కూల్చివేత: కేసీఆర్‌కు హైకోర్టు షాక్

ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మెళ్లిగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయని... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు కేవలం బావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాయని... అయితే ఈ ట్రాప్ నుండి ప్రస్తుతం ప్రజలకు బయటకు వచ్చారని అన్నారు. ప్రజలు కేవలం అభివృద్ది కోణంలోనే ఓటేసే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతున్నాయని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి పార్టీకోసం పనిచేస్తే తప్పకుండా అధికారంలోకి రావడం ఖాయమని జగ్గారెడ్డి అన్నారు. టిపిసిసి అధ్యక్ష పదవి వరిస్తే అందరినీ కలుపుకుపోయి తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవాన్ని తీసుకువస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.