కాలికి వైద్యం చేయమని అడిగితే... దానికి వైద్యం చేయకపొగా... ఉన్న చెయ్యి పోగొట్టారు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఇదేంటని వైద్యులను ప్రశ్నిస్తే... బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన వైద్యులు వెటకారంగా మాట్లాడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కె.కొత్తపూడికి చెందిన గుమ్మడి రాజు(27) విజయవాడలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల కిందట ద్విచక్రవాహన స్టాండ్ కాలికి తగలడంతో అతనికి గాయమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా... విధుల్లో ఉన్న వైద్యుడు కాలు గాయానికి కట్లు వేసి కట్టు కట్టాడు. 

తర్వాత ఇద్దరు సిబ్బంది వచ్చి రెండు ఇంజక్షన్లను ఒకేసారి రెండు చేతులకు చేశారు. ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి రాజుకి చెయ్యి పనిచేయడం మానేసింది. దీంతో వెంటనే కంగారుగా మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. దానికి వాళ్లు వైద్యం చేయకపోగా...వెటకారంగా మాట్లాడారు. కాలికి తగిలిన దెబ్బ మాయం గాకపోగా... చెయ్యి పనిచేయడం మానేసింది.

అనంతరం బాధితుడు మరో వైద్యుడిని సంప్రదించగా.. ఇంజక్షన్ సరిగా చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని పరీక్షల్లో తేలింది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే.. తనను అవిటి వాడిని చేశారంటూ బాధితుడు బాధపడటం గమనార్హం. కాగా... బాధితుడికి హాస్పిటల్ యాజమాన్యం పరిహారం కింద రూ.లక్షలు ముట్టచెప్పడం గమనార్హం. కాగా.... బాధితుడి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.