నంద్యాలలో దారుణం జరిగింది. కేబుల్ కనెక్షన్ బిల్లు కట్టమన్నందుకు కేబుల్ ఆపరేటర్‌పై కత్తితో దాడి చేశారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. చంద్రశేఖర్ రెడ్డి అనే కేబుల్ ఆపరేటర్ ఆదివారం నంద్యాల ఎన్జీవో కాలనీలో కేబుల్ బిల్లులు వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కేబుల్ డిష్ బిల్లు చెల్లించాలని పెద్దన్న అనే వ్యక్తిని కోరాడు.

దీంతో ఆగ్రహానికి గురైన అతను తన కుమారుడికి చెప్పాడు. ఆగ్రహంతో ఊగిపోయిన అతను కత్తి తీసుకుని చంద్రశేఖర్ రెడ్డి కడుపులో పొడిచాడు. వెంటనే స్పందించిన స్థానికుడు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బీట్ కానిస్టేబుల్ చూస్తుండగానే దుండగులు తన కడుపులోకి పొడిచారని చంద్రశేఖర్ రెడ్డి వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న నంద్యాల టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:ఫైన్ కట్టమన్నందుకు మహిళా టీటీఐని రైలు నుంచి తోసేసిన దుండగులు

కొద్దిరోజుల క్రితం జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలోకి ఎక్కారని జరిమానా చెల్లించమన్న మహిళా ట్రావెలింగ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ ను రైలులోంచి బయటకు తోసేశారు కొందరు దుండగులు. 

సికింద్రాబాద్ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో గాయాలపాలైన ఆ అధికారి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మహిళా ట్రావెలింగ్ టికెట్ ఇన్ స్పెక్టర్ నీలిమ కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా విధులు నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వచ్చిన రైలులో తనిఖీ చేసేందుకు ఆమె ట్రైన్ ఎక్కారు. ఆ సమయంలో స్లీపర్ క్లాస్ బోగీలో చాలా మంది జనరల్ టికెట్ తీసుకున్న వారు ప్రయాణించడం చూసిన ఆ అధికారి వారికి ఫైన్ వేశారు. జరిమానా కట్టమని అడగడంతో వారిలో కొందరు ఆమెను రైలు నుంచి బయటకు తోసేశారు. 

Also Read:టోల్ ట్యాక్స్ కట్టమన్నందుకు: ఉద్యోగిని 6 కిలోమీటర్లు కారుపై ఈడ్చుకెళ్లాడు

దీంతో నీలిమ కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లింది. ఆ సమయంలో రైలు నిలిచిఉండటంతో పక్కనే ఉన్న ప్రయాణికులు ఆమెను పక్కకు లాగేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్నరైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మహిళా అధికారి నీలిమను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా అధికారిని రైలులో నుంచి బయటకు తోసేసిన దుండగులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.