సంపూర్ణ మద్య నిషేధం అన్న తమ మేనిఫెస్టోలో హామీ అమలు పరిచే విధంగా జగన్ సర్కార్ మొదటి అడుగు ముందుకు వేసింది.

20% షాపులన్నీ రద్దు చేస్తూ మద్యం విక్రయాలను పెంచుతూ ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులను ప్రారంభించింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఎక్సైజ్ అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.

దీనిపై కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ చెన్నకేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 205 మద్యం షాపులకు గాను 20శాతం తగ్గించి 164 మాత్రమే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

మద్యపాన నిషేధం అమలు కోసం 164 మంది సూపర్‌వైజర్లను, 457 సేల్స్‌మెన్లను నియమించినట్లు చెన్నకేశవరావు తెలిపారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం ధరలు పెంచామని ఈ విషయాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు గుర్తించాలని ఆయన సూచించారు.

ప్రస్తుతం విక్రయిస్తున్న బాటిల్స్‌పై పాత మద్యం రేట్లు ఉంటాయని కానీ కొత్తధరలు అమలులోకి వస్తాయని అందుకోసం షాపు బయట ధరల పట్టికను ఏర్పాటు చేశామని చెన్నకేశవరావు వెల్లడించారు. 

కార్పొరేషన్,మునిసిపాలిటీ, మండల్ హెడ్ క్వార్టర్ లాంటి ప్రదేశాలలో ఉన్న షాపుల్లో ఒక సూపర్వైజర్ ముగ్గురు సేల్స్ మెన్ ఉంటే మారుమూల ప్రాంతాలలో ఒక సూపర్‌వైజర్ ఇద్దరు సేల్స్ మెన్ ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించినా, అక్రమాలకు పాల్పడినా తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెన్నకేశవరావు సూచించారు. మద్యం దుకాణం వద్ద కానీ సమీపంలో కానీ మద్యం సేవించేందుకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు.

ఎవరైనా కూల్డ్రింక్ షాపులు, చిరుతిళ్ల దుకాణాలు ఏర్పాటు చేసి అక్కడ మద్యపానానికి వాతావరణం కల్పిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా 46 బార్& రెస్టారెంట్లకు మాత్రం అనుమతులు ఉన్నాయని... ప్రస్తుతం పాత మద్యం గైడ్లైన్స్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకు వాటికి అనుమతులు ఉన్నాయన్నారు.  

కొత్త మద్యం పాలసీ తో వాటిలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, వినియోగదారులు కొత్త నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని చెన్నకేశవరావు విజ్ఞప్తి చేశారు