హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని జానెత్ జార్జ్ మెమోరియల్ స్కూల్లో చదువుకుంటున్న 15 ఏళ్ల బాలికపై స్కూల్ హెడ్ మాస్టర్ దారుణానికి ఒడిగట్టాడు. గత కొన్ని నెలలుగా ఆమెపై లైంగిక దాడి చేస్తున్నాడు.

నిందితుడు ప్రసాద రావుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కోలవెంటి ప్రసాదరావుతో పాటు ఆయన భార్య కొలవెంటి సారథిని శనివారంనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాదరావుతో పాటు ఆయన భార్య కూడా బాలికపై అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఆమెను వేధించారని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బాధితురాలు శుక్రవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగో తరగతి చదవడానికి బాధితురాలు 2015లో హాస్టల్లో ఉంటూ పాఠశాలలో చేరింది. ఆమె ఎనిమిదో తరగతికి రాగానే హెడ్ మాస్టర్, వార్డెన్ అయిన ప్రసాద్ రావు ఆమెపై కన్నేశాడు. హాస్టల్ గదిలోకి ప్రవేశించి ఆమె శరీరభాగాలను స్పృశిస్తూ బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేస్తూ వస్తున్నాడని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 

పోలీసుల ప్రకటన వివరాలను బట్టి... పలుమార్లు అతను బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారానికి ఓసారి ఆమెపై అత్యాచారం చేస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తూ వచ్చాడు. హాస్టల్లోనే పనిచేస్తున్న అతని భార్య సారథి కూడా బాధితురాలిని హింసిస్తూ ఆమెతో దుస్తులు ఉతికించడం, పాత్రలు కడగడం వంటి పనులు చేయిస్తూ వచ్చింది. పనిచేయకుంటే కొడుతూ ఉండేది. 

వారి వేధింపులను తట్టుకోలేక బాలిక హాస్టల్ నుంచి బయటకు వచ్చింది. హాస్టల్లో అటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని కూడా పోలీసులకు చెప్పింది. ప్రసాదరావు  అతని భార్య సారథి కృష్ణా జిల్లాలోని విజయవాడలో గల బడావపేటకు చెందినవారు.