గుంటూరు జిల్లాలో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రొంపిచర్ల హైవే సుబ్బయ్యపాలెం స్టేజివద్ద వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలయిన వ్యక్తిని మొదట నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.    

ఈ ప్రమాదానికి గురయిన అందరూ తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు ధర్మపురి మండలానికి చెందిన వారు కాగా మిగతా ఇద్దరు యుపి కి చెందినవారు. వీరంతా ఉపాధి నిమిత్తం గత 15 సంవత్సరాలు గా ధర్మపురిలో నివాసం ఉంటున్నారు. నెల్లూరులోని ఓ ఇంటి పని నిమిత్తం వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది.