కర్నూల్: ప్రస్తుతం ఎమ్మెల్యే కావాలంటే   రూ. 100 కోట్లు, ఎంపీ కావాలంటే రూ. 200 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు  నెలకొన్నాయని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి  అభిప్రాయపడ్డారు.

విప్లవ సినిమాల నిర్మాత.. దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మంగళవారం నాడు  కర్నూలులో పర్యటించారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా ప్రమోషన్లో భాగంగా  నారాయణమూర్తి కర్నూలు కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బీసీ భవన్ లో పలువురు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. 

పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో  వెనక్కి తీసుకొన్నానని పలువురు మిత్రులు, ప్రజాస్వామ్య ప్రియుల కోరిక మేరకు నవంబర్ 15న మరోసారి విడుదల చేయనున్నట్టుగా  నారాయణమూర్తి ప్రకటించారు.

డబ్బు పెట్టి గెలిచిన వారు ప్రజాప్రతినిధులైతే.. ప్రజలకు ఏం సేవ చేస్తారనీ ప్రశ్నించారు.ఖర్చు పెట్టిన దాన్ని రెండింతలు సంపాదించుకోవాలని చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రజాస్వామ్యం.... ధనస్వామ్యం,వ్యాపార స్వామ్యం అయిపోతోందనీ.. నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే.. 90 శాతం పేదల్లో నుండి వచ్చిన వారే ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా గెలిచే పరిస్థితి రావాలన్నారు. పేదలు ఎమ్మెలు. ఎంపీలుగా గెలిచిన రోజే నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లు అని ఆయన చెప్పారు.

 "సీమ నేతలతో మాటా మంతి "

ఈ సందర్భంగా రాయలసీమ నేతలు తన దృష్టికి తెచ్చిన సమస్యలపై ఆర్.నారాయణమూర్తి  స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతోపాటు.. రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఆర్.నారాయణమూర్తి ప్రకటించారు. అనేక విధాలుగా నష్టపోయి కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని పెద్దలు పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా నారాయణమూర్తి విజ్ఘప్తి చేశారు.