Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు సీమలో పెట్టకపోతే.. ప్రత్యేక ఉద్యమమే: టీజీ వెంకటేశ్

రాయలసీమలో రాజధాని అనే అంశంపై రాజ్యసభ సభ్యులు బిజెపి నేత టిజి వెంకటేష్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు... ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు న్యాయవాదులు విద్యావంతులు ఉద్యమకారులు హాజరయ్యారు

bjp mp tg venkatesh comments on rayalaseema movement
Author
Kurnool, First Published Oct 1, 2019, 8:31 PM IST

రాయలసీమలో రాజధాని అనే అంశంపై రాజ్యసభ సభ్యులు బిజెపి నేత టిజి వెంకటేష్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు... ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు న్యాయవాదులు విద్యావంతులు ఉద్యమకారులు హాజరయ్యారు.

రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పై నేతలందరూ కూలంకషంగా చర్చించారు...కర్నూలులో రాజధానితోపాటు హైకోర్టును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను బలంగా నినదించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన సీమ తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..

తాము కేవలం హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు..ప్రభుత్వం అవలంబించే విధానాల వల్ల ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకునే ప్రమాదం ఉందని నేతలు హెచ్చరించారు.

ఇప్పటికే విద్యార్థులు న్యాయవాదులు రోడ్ల పైకి వచ్చారని పరిస్థితి ఇలాగే కొనసాగితే సాధారణ జనం సైతం ప్రత్యేక రాయలసీమ డిమాండ్ ను తెరపైకి తేస్తారు అని గుర్తు చేశారు. రాజధానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు వనరులు రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయని వారు పేర్కొన్నారు.

రాజధాని నిర్మించినా... రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఏర్పాటుచేసినా.. అందుకు కర్నూలు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరచి ప్రజల ఆకాంక్షను గుర్తించి సీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అక్టోబర్ 1వ తేదీన జరిగిందని ...ఎన్టీఆర్ ఉండి ఉంటే రాజధాని రాయలసీమ లో ఉండేదన్నారు. నవంబర్ 2న రాజధాని తరలిపోయిందనీ అదో దురదృష్టకర సంఘటనగా నేతలు అభివర్ణించారు.

కర్నూలులో రాజధాని కట్టాలంటే ఎటువంటి ఖర్చు ఉండదనీ... ఇక్కడి బిల్డర్లకు 50-50 గా ఇస్తే  భవనాలు పూర్తి చేస్తారని... లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేవాళ్ళు సీమ జిల్లాలో ఉన్నారనీ ధీమా వ్యక్తం చేశారు .

పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు అక్టోబర్ 1ని అప్పట్లో .. రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలని మెజారిటీ ఎమ్మెల్యే లు కోరుకున్నారని  నేతలు గుర్తుచేశారు.

గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదనీ ఆరోపించారు..అమరావతి ఇంతవరకు ఫ్రీ జోన్ చేయలేదనీ, దీంతో మిగిలిన ప్రాంతాల వారు ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం నగరంలో క్యాన్సర్ ఆసుపత్రికి 100 కోట్లు కేటాయించడం జరిగిందనీ...కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios