సబ్బవరం:విశాఖపట్టణం జిల్లాలోని జోడుగుళ్ల మండలకేంద్రంలో ఓ వివాహిత ఉరేసుకొని బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురును అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మండలంలోని బుడెరెడ్లపాలెం కు చెందిన బి.శ్రీనివాస్ కు అదే మండలంలోని  నాయనమ్మపాలెం గ్రామానికి చెందిన పి.అర్జునరావు కూతురు భవాణిని ఇచ్చి 2008లో పెళ్లి చేశారు.  పెళ్లి సమయంలో 10 తులాల బంగారం, రూ. 4 లక్షల కట్నం ఇచ్చారు.

అయితే అదనపు కట్నం కోసం ప్రతి రోజూ తమ కూతురును అత్తింటి వాళ్లు వేధింపులకు గురి చేసేవారని మృతురాలి కుటుంబసబ్యులు ఆరోపిస్తున్నారు.

భవాణి బుధవారం నాడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భవాణి ఉరేసుకొన్న సమయంలో ఆమె కాళ్లు భూమికి తాకుతూ ఉండడంపై మృతురాలి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టుగా సీఐ తెలిపారు.