అతనికి అప్పటికే వివాహం అయ్యింది. చక్కని భార్య, కుమార్తె ఉన్నారు. బాధ్యతగల ఉద్యోగస్తుడు అతను. అలాంటి వ్యక్తి బుద్ధి వక్రంగా ఆలోచించింది. భార్య, కుమార్తెను కాదనుకొని... మరో యువతిపై మోహం పెంచుకున్నాడు. మాయమాటలు  చెప్పి యువతికి దగ్గరయ్యాడు. ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సురపం రమేష్(29) ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా... రమేష్ జవహర్ నగర్ బాలాజీ నగర్ కి చెందిన స్నేహితుడి వద్దకు తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో 2018లో బాలాజీనగర్ కు చెందిన ఓ యువతి(22) తో పరిచయం ఏర్పడింది.

తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచి... యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలాజీనగర్ లో కాపురం పెట్టాడు. కాగా ఈ విషయం అతని మొదటి భార్యకు తెలిసింది. అంతే వెంటనే భర్తని, అతని రెండో భార్యను నిలదీసింది. అక్కడి నుంచి తన భర్తను తీసుకొని ఆమె వెళ్లిపోయింది.

కాగా... మొదటి భార్య వచ్చి గొడవచేసేవరకు అతనికి ముందే పెళ్లి అయ్యిందని తెలియని ఆ యువతి మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకుంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు.