కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. తాజాగా కర్నూలులోని జీజీహెచ్ వైద్యురాలికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. 

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది వైద్యులు కరోనా వైరస్ మహమ్మారికి చిక్కారు. కర్నూలు జిల్లాలో 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఈ జిల్లాలోనే కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో 9 మంది మరణించారు.

ఇదిలావుంటే, కాళహస్తిలో ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. తాను పాకిస్తాన్ నుంచి వచ్చానని, తనతో పాటు ముగ్గురు ఉన్నారని చెప్పాడు. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, అతనికి మతిస్తిమితం లేదని పోలీసులు చెప్పారు.

మరోవైపు, జిల్లాలోని కరోనా వైరస్ రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ నేత భూమా అఖిలప్రియకు, వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరువురు సవాళఅలు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. 

హఫీజ్ ఖాన్ వల్లనే జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆ విషయం నిరూపిస్తే తాను కర్నూలు సెంటర్ లో ఉరేసుకుంటానని హఫీజ్ ఖాన్ అన్నారు.