తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ...ఓ 12ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... మచిలీపట్నానికి చెందిన 12ఏళ్ల బాలుడు బుధవారం ఆర్ పేట పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. కాగా... అక్కడ తన తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హీటర్ తో తన ఒంటిపై గాయాలు పెట్టడానికి ప్రయత్నించారని... వారి వద్ద నుంచి తాను తప్పించుకొని పారిపోయి వచ్చానని పోలీసులకు వివరించాడు. ఆ బాలుడు చెప్పినదంతా తొలుత పోలీసులు కూడా నిజమని చెప్పడం గమనార్హం. వెంటనే బాలుడు తల్లిదండ్రులను పిలిచి బాలుడు చెప్పిన విషయం గురించి విచారించారు.

కాగా... తల్లిదండ్రులపై బాలుడు చేసిన ఫిర్యాదు విని వారు కూడా ఆశ్చర్యపోయారు. చదువుకోమని మందిలించినందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాలుడు అబద్ధం చెప్పాడని తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఆ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులతో అక్కడి నుంచి పంపేశారు.