సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి వద్ద గురువారం తెల్లవారుజామున  దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్ హెచ్-65) పై గురువారం నాడు తెల్లవారుజామున విజయవాడ నుండి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులు తరచూ ప్రమాదానికి గురౌతున్నాయి. ఇవాళ జరిగిన ప్రమాదానికి కూడ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. 

దురాజ్‌పల్లి గ్రామంలో డివైడర్ ను ఢీకొని బస్సు బోల్తా కొట్టిందని క్షతగాత్రులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయాలతోనే బయటపడ్డారు.