స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఫేస్ చేయాలో చెబుతూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్‌కి భారత లెజండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన సలహాలు, సూచనలు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా లంక టూర్‌లో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లకు ఈ ప్రింట్ తీసి ఇవ్వాలని, ద్రావిడ్ పంపిన మెయిల్‌ను పోస్టు చేశాడు కేవిన్ పీటర్సన్...

11 ఏళ్ల క్రితం రాహుల్ ద్రావిడ్ పంపిన మెయిల్‌ను కేవిన్ పీటర్సన్ బయటపెడితే, ఇప్పుడు తాజాగా తనకి కూడా ఆయన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చాడు జింబాబ్వే మాజీ కెప్టెన్ తైబు... ‘ఇండియాలో మొదటి రెండు టెస్టుల్లో నన్ను అనిల్ కుంబ్లే మూడు, నాలుగు సార్లు అవుట్ చేశాడు... అప్పుడు మ్యాచ్ డ్రింక్ బ్రేక్ సమయంలో రాహుల్ ద్రావిడ్ సలహా తీసుకున్నాను.

కుంబ్లే బౌలింగ్ ఎలా ఫేస్ చేయాలో చెప్పాలంటూ కోరాను... అతన్ని స్లో మీడియం పేసర్‌గా అనుకుని బ్యాటింగ్ చేయమని, ప్యాడ్స్ ముందు బ్యాట్ పెడుతూ లేటుగా షాట్ ఆడమని ద్రావిడ్ చెప్పారు. మరీ ముఖ్యంగా బంతిని దగ్గరి నుంచి గమనించమని ఆయన సలహా ఇచ్చాడు’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు తైబు.

అండర్ 19 కోచ్‌గా భారత యువ ఆటగాళ్లను రాటు దేల్చి, వారి సత్తాను బయటికి తీసిన రాహుల్ ద్రావిడ్, విదేశీ ప్లేయర్లకు కూడా తన సలహాలతో సాయం చేశాడని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రాహుల్ ద్రావిడ్ భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.