మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్... భారత క్రీడారంగంలో విపరీతమైన చర్చకు దారితీసిన అంశం. గతేడాది చివరినుండి అతడి రిటైర్మెంట్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ  ప్రచారం మరింత ఊపందుకుంది. నేడో రేపో ధోని నుండి అధికారిక ప్రకటన వెలువడనుందని కూడా సోషల్ మీడియా మధ్యమాల ద్వారా తెగ ప్రచారం జరిగింది. ఇలా  లెజెండరీ క్రికెటర్ ధోని కెరీర్ పై ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడటాన్ని ఇప్పటికే పలువరు క్రికెటర్లు స్పందించారు. మాజీ  క్రికెటర్, ధోని సహచరుడు యువరాజ్ సింగ్ తాజాగా ఈ ప్రచారంపై కాస్త ఘాటుగా స్పందించాడు. 

''ఎంఎస్ ధోని భారత క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన గొప్ప ఆటగాడు. అతడు టీమిండియాకు నిస్వార్థంగా, అంకితభావంతో ఎంతో సేవ చేశాడు. అందువల్లే భారత జట్టు సక్సెస్ రేట్ పెరగింది. ఇలాంటి సక్సెస్‌ఫుల్ సారథి రిటైర్మెంట్ గురించి ఎవరికి తోచినట్లు వారు ఓ అంచనాకు రావడం, అసత్య ప్రచారాలను స్ప్రెడ్ చేయడం ఎంతవరకు సమంజసం. 

అనుభవజ్ఞుడైన క్రికెటర్ గా ఎప్పుడు రిటైరవ్వాలో ధోనికి బాగా తెలుసు. ఎవరూ ఆయనకు సలహాలివ్వాల్సిన అవసరం లేదు. ఆయన నుండి నిర్ణయం వెలువడేవరకు వేచి చూడటమే మన పని. క్రికెట్ ను వీడాలనుకుంటే ఆయనే స్వయంగా ప్రకటిస్తాడు కదా. మరి తొందరెందుకు. ఆలోచించుకునేందుకు ఆయనకు సమయం ఇవ్వాలి. 

మరికొంత కాలం క్రికెట్ ఆడాలనుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. జట్టుకు తన అవసరం లేదనుకుంటే ఆయనే గౌరవంగా తప్పుకుంటాడు. కాబట్టి ఇకనైనా ధోని రిటైర్మెంట్ పై చర్చించడం ఆపితే మంచింది.'' అని యువీ అభిప్రాయపడ్డాడు.