IPL 2022: గత కొంతకాలంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్ లో కాస్త బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా మెరుస్తున్నాడు. అయితే అతడి వ్యవహార శైలి విమర్శలకు తావిస్తున్నది.
క్రికెట్ లో ఒక ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాక సెలబ్రేషన్స్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఆ సంబురాలు అందరూ మెచ్చే విధంగా ఉంటే మంచిది.. హద్దు మీరితే అది ప్రమాదకరం అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్. ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఉన్న హెడెన్.. రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ప్రవర్తనా శైలిపై చిందులు తొక్కాడు. విధి అందరి సరదా తీరుస్తుందని, దానిని గుర్తుంచుకుని జాగ్రత్తగా మసులుకోవాలని సూచించాడు. ఇంతకు హెడెన్ మనసుకు అంత గాయమనిపించడానికి కారణమేంటంటే..
రెండ్రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్.. లక్నో ఆటగాడు, ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్నాక కాస్త వినూత్న రీతిలో వేడుకలు జరుపుకున్నాడు.
ప్రసిధ్ వేసిన లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో స్టోయినిస్ భారీ షాట్ ఆడాడు. అయితే బంతి లాంగాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పరాగ్ చేతిలో పడింది. క్యాచ్ అందుకున్న పరాగ్.. దానిని మెల్లగా గ్రౌండ్ కు తాకించబోయాడు. ఇదే హెడెన్ కోపానికి కారణమైంది. తాజాగా అతడు స్పందిస్తూ.. ‘నీ కోసం ఓ చిన్న అడ్వైజ్ యంగ్ మ్యాన్. క్రికెట్ అనేది సుదీర్ఘ కాలం కొనసాగే ఆట. ఈ ఆటలో మనందరికీ చాలా జ్ఞాపకాలుంటాయి. విధిని నువ్వు వెక్కిరించొద్దు.. అది నిన్ను నువ్వు ఊహించినంత త్వరగా బదులు తీర్చుకుంటుంది..’ అని వార్నింగ్ ఇచ్చాడు.
హెడెన్ తో పాటు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కూడా ఇదే విషయమ్మీద పరాగ్ ను తప్పుబడుతున్నారు. పరాగ్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే పరాగ్ ఇలా చేయడానికి ఓ కారణముంది. అతడు ఔట్ కాకముందు ఓవర్లో మెక్ కాయ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ ను పరాగ్ చాలా దూరం నుంచి పరిగెత్తుతూ వచ్చి ముందుకు డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. అయితే టీవీ రిప్లేలో మాత్రం బంతి ముందు గ్రౌండ్ కు తాకి ఆ తర్వాత పరాగ్ చేతిలో పడిందని స్పష్టమైంది.
దీంతో రెండో సారి ఈజీ క్యాచ్ అందుకున్న పరాగ్.. ఈ క్యాచ్ భూమికి తాకలేదని చెప్పడానికే ఇలా చేశాడు. ఏదేమైనా అతడు చేసిన ఈ చిలిపి చర్య నెటిజన్లతో పాటు క్రికెట్ దిగ్గజాలకు కూడా కోపం తెప్పించింది. ఈ సీజన్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న జాబితాలో పరాగ్ ముందున్నాడు. ఐపీఎల్ - 2022 లో అతడు మొత్తంగా 13 క్యాచ్ లు అందుకున్నాడు. అతడి తర్వాత ముంబై కి చెందిన ఆటగాడు తిలక్ వర్మ 9 క్యాచ్ లు పట్టాడు.
