INDvsAUS Indore Test:  భారత్ - ఆస్ట్రేలియా మధ్య రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్టుకు ముందు ఆసీస్ ఈ మ్యాచ్ లో జట్టు కూర్పు ఎలా ఉండాలి..? అనే డైలమాలో ఉంది. ఈ నేపథ్యంలో...  

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా బుధవారం నుంచి భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా మూడో టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. గత రెండు టెస్టులలో పిచ్ లు స్పిన్ కు ఎక్కువగా అనుకూలించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో కూడా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని ఆసీస్ భావిస్తున్నది. అయితే ఇండోర్ లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడాల్సిన పన్లేదని.. ఇద్దరు సరిపోతారని ఆ జట్టు మాజీ ఆటగాడు మైఖేల్ కాస్ప్రోవిచ్ సూచించాడు. ఈ సిరీస్ లో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఆసీస్ కు ఇండోర్ టెస్టు కీలకం. 

ఢిల్లీలో ఆస్ట్రేలియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ తో పాటు యువ ఆటగాడు టాడ్ మర్ఫీ, మాథ్యూ కున్హెమన్ లు ఆడారు. ఇండోర్ లో మాత్రం ముగ్గురు స్పిన్నర్లతో కాకుండా ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడించాలని సూచించాడు. 

ఇండోర్ టెస్టుకు ముందు కాస్ప్రోవిచ్ మాట్లాడుతూ.. ‘మన (ఆస్ట్రేలియా)కు ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదు. లియాన్ తో కలిసి మర్ఫీ లేదంటే కున్హెమన్ లలో ఎవరినో ఒకరినే ఆడించాలి. కమిన్స్ ఎలాగూ లేడు కాబట్టి అతడి స్థానంలో మిచెల్ స్టార్క్ ను ఆడించాలి. డేవిడ్ వార్నర్ స్థానంలో కామెరూన్ గ్రీన్ ను తీసుకుంటే అతడు స్టార్క్ తో కలిసి బౌలింగ్ చేయగలడు. మూడో సీమర్ గా స్కాట్ బొలాండ్ ను ఎంచుకోవడం బెటర్. నాగ్‌పూర్ టెస్టులో బొలాండ్ వికెట్లేమీ తీయలేదు గానీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. బొలాండ్ బౌలింగ్ లో భారత బ్యాటర్లు పరుగులు తీయడానికే ఇబ్బందిపడ్డారు.. 

బొలాండ్ తో పాటు లియాన్ లేదా మర్ఫీని ఒకే స్పెల్ లో వేయించొచ్చు. బొలాండ్ బ్యాటర్లను కట్టడి చేస్తే స్పిన్నర్లు వికెట్ల సంగతి చూసుకుంటారు. గ్రీన్ కూడా ఉన్నాడు కాబట్టి భారత్ పిచ్ లపై అతడు కూడా ప్రభావం చూపగలడు...’అని అన్నాడు. 

ఇదీ చదవండి : జంతువులంటే ప్రేమ.. వ్యాపారంలోనూ సూపర్ హిట్.. లార్డ్ శార్దూల్ వైఫ్ మిథాలీ గురించి ఆసక్తికర విషయాలు..

కాగా ఆస్ట్రేలియా చివరిసారి భారత్ లో సిరీస్ గెలిచినప్పుడు కాస్ప్రోవిచ్ ఆ జట్టులో సభ్యుడు. 2004లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భారత్ ను భారత్ లో ఓడించిన విషయం తెలిసిందే. 51 ఏండ్ల వెటరన్.. ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టులు ఆడి 113 వికెట్లు పడగొట్టాడు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా మూడో టెస్టుకు కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆసీస్ జట్టుకు స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించనున్నాడు. హెజిల్వుడ్, వార్నర్, అగర్ లు కూడా జట్టును వీడారు. దీంతో గ్రీన్ రాక ఆసీస్ కు అత్యావశ్యకం. అతడు పూర్తి స్థాయిలో కోలుకున్నా స్టార్క్ రాకపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.