SRH Fans Roasted Kane Williamson: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో అత్యంత చెత్త ఆటతో, అసలు వ్యూహాలే లేకుండా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్ పై ఆరెంజ్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఐపీఎల్-15లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరడం ఇక కష్టమే. శనివారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్ లో 54 పరుగుల తేడాతో ఓడటంతో సన్ రైజర్స్ కు ఆ అవకాశం లేకుండా పోయినట్టైంది. సాంకేతికంగా ఇంకా ఛాన్సుందని చెప్పుకున్నా అది గాలిలో దీపం వంటిదని అందరికీ తెలుసు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ వైఫల్యానికి సారథి కేన్ విలియమ్సన్ కారణమని, అతడి ఆటతీరు వల్లే ఎస్ఆర్హెచ్ కు ఈ గతి పట్టిందని హైదరాబాద్ అభిమాలను కేన్ మామపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఓటములకు విలియమ్సనే కారణమని.. ప్రపంచ స్థాయి ఆటగాడైన కేన్ మామ.. గల్లీ క్రికెటర్ కంటే అధ్వాన్నంగా ఆడుతున్నాడని కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచులను ఓటమితో ప్రారంభించిన సన్ రైజర్స్.. తర్వాత ఐదు మ్యాచులు వరుసగా గెలిచి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేలా కనిపించింది. కానీ తర్వాత అనూహ్యంగా మళ్లీ ఓటముల బాట పట్టింది. తిరిగి ఐదు పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నది.
ఈ సీజన్ లో 12 మ్యాచులు ఆడిన విలియమ్సన్.. 17.33 సగటుతో 208 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న ఈ న్యూజిలాండ్ సారథి.. టెస్టు క్రికెట్ మాదిరి ఆడుతూ విలువైన బంతులను వృథా చేస్తున్నాడు. మరో ఎండ్ లో కుర్రాడు, పెద్దగా అనుభవం కూడా లేని అభిషేక్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుంటే.. విలియమ్సన్ మాత్రం టెస్టుల కంటే అధ్వాన్నంగా ఆడుగూ విమర్శల పాలవుతున్నాడు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభిమానులు.. కేన్ మామను ఏకిపారేస్తున్నారు. ట్విటర్ వేదికగా పలువురు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘ఎప్పుడైనా ఆడావా మిస్టర్ కేన్ విలియమ్సన్...’, ‘కేన్ మామ మ్యాచులను గెలిపిస్తున్నాడు.. ఎస్ఆర్హెచ్ కు కాదు.. అపోజిట్ టీమ్ లకు..’, ‘ఈ సీజన్ లో అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకుంటూ ఫీల్డింగ్ సమయంలో లాస్ట్ ఓవర్ స్పిన్నర్ చేత బౌలింగ్ చేయించిన కేన్ విలియమ్సన్ గారికి కృతజ్ఞతలు..’ అని ట్రోల్స్ చేస్తున్నారు.
మరో యూజర్ స్పందిస్తూ..‘అసలు టీమ్ లో కేన్ విలియమ్సన్ రోల్ ఏంటి..? బ్రియాన్ లారా బ్యాటింగ్ కోచ్ గా ఉండి ఏం చేస్తున్నట్టు..? మీ మిడిలార్డర్ బ్యాటర్లు మిగతా జట్ల కంటే అధ్వాన్నంగా ఉన్నారని మీరెప్పుడైనా గమనించారా..? జట్టును సెలెక్ట్ చేస్తున్నదెవరు..?’ అంటూ సన్ రైజర్స్ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అక్షయ్ అని రాసిఉన్న ఓ యూజర్.. ‘ఈ పరాజయాలకు ముమ్మాటికీ బాధ్యుడు కేన్ విలియమ్సనే.. అందుకు అతడు బాధ్యత వహిస్తాడా..? వజ్రం (కేన్ విలియమ్సన్) కోసం వెతికే క్రమంలో మీరు బంగారాన్ని (డేవిడ్ వార్నర్) కోల్పోయారు..’ అని రాసుకొచ్చాడు.
ఇక శనివారం నాటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేయగలిగింది. 17 బంతులాడిన కేన్ మామ.. 9 పరుగులే చేశాడు. అభిషేక్ శర్మ (43) టాప్ స్కోరర్. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కు ఇది ఏడో పరాజయం.
