Irani Cup 2023: ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఐపీఎల్ లో రాజస్తాన్ తరఫున ఆడే యశస్వి జైస్వాల్ తో పాటు అభిమన్యు ఈశ్వరన్ లు సెంచరీలతో కదం తొక్కారు.
ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌లో భాగంగా గత రంజీ సీజన్ (2021-22) విజేత మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా తొలి రోజే అదరగొట్టింది. ఆ జట్టు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ (154) తో చెలరేగగా వన్ డౌన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ద్విశతకం (259 బంతుల్లో 213, 30 ఫోర్లు, 3 సిక్సర్లు) తో చెలరేగాడు. ఈ ఇద్దరూ వీరవిహారం చేయడంతో తొలి రోజే రెస్టాఫ్ ఇండియా.. 87 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.
గ్వాలియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన రెస్టాఫ్ ఇండియా.. రెండో ఓవర్లోనే ఫామ్ లో ఉన్న బ్యాటర్, ఆ జట్టు సారథి మయాంక్ అగర్వాల్ (2) వికెట్ ను కోల్పోయింది. అవేశ్ ఖాన్ బౌలింగ్ లో అగర్వాల్ హిమాన్షు మంత్రికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన యశస్వి తో కలిసి ఈశ్వరన్ రెచ్చిపోయాడు. ఇద్దరూ గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ భారీ స్కోరుకు బాటలు వేశారు. ముఖ్యంగా జైస్వాల్ అయితే వన్డే మాదిరిగా దూకుడుగా ఆడాడు. ఇద్దరూ కలిసి మధ్యప్రదేశ్ బౌలర్లను ఆటాడుకున్నారు.
ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే యశస్వి.. ఈ మ్యాచ్ లో సాధించిన 213 పరుగులలో 138 రన్స్ ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే వచ్చాయంటే అతడి దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరి దాటికి మధ్యప్రదేశ్ బౌలర్లు తేలిపోయారు. ఈ జోడీని విడదీయడానికి మధ్యప్రదేశ్ సారథి హిమాన్షు మంత్రి ఏడుగురు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. రెండో వికెట్ కు ఈ ఇద్దరూ ఏకంగా 371 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో జైస్వాల్ కు 25 ఇన్నింగ్స్ లలో మూడో డబుల్ సెంచరీ కావడం గమనార్హం.
అయితే కొద్దిసేపట్లో తొలి రోజు ఆట ముగుస్తుందనగా యశస్వి.. అవేశ్ ఖాన్ వేసిన 84వ ఓవర్లో నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే అభిమన్యును సారాన్ష్ జైన రనౌట్ చేశాడు. ప్రస్తుతం సౌరభ్ కుమార్ (0 నాటౌట్) , బాబా ఇంద్రజిత్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
