WTC Final 2023:  ఆస్ట్రేలియా - ఇండియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్  టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్  లో భారత్  గెలవాలంటే పటిష్టమైన ఆసీస్ పేసర్లతో  ఓ యుద్ధమే చేయాల్సి ఉంది. 

డబ్ల్యూటీసీ ఫైనల్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానిరి 296 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. నేడు కూడా రెండు సెషన్ల వరకూ బ్యాటింగ్ చేసి 400 ప్లస్ టార్గెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పటిస్ఠ స్థితిలో ఉన్న ఆసీస్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ తో పాటు మార్నస్ లబూషేన్ క్రీజులో ఉండగా అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి వాళ్లు కూడా బ్యాటింగ్ చేయగల సమర్థులు. ఈ నేపథ్యంలో ఆసీస్ 400 ప్లస్ టార్గెట్ ఉంచడం పెద్ద విషయమేమీ కాదు. 

ఎటొచ్చి భారత జట్టుకే కష్టాలు తప్పేట్టు లేవు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 400 ప్లస్ టార్గెట్ ఛేదించాల్సి వస్తే అది ఓవల్ లో అయితే కష్టమే. ఇక్కడి రికార్డులను చూస్తే కూడా ఇదే నిజమనిపించకమానదు. 

ఇంగ్లాండ్ లో ఇంతవరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్ లో 300 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన సందర్భాలు ఆరు సార్లు మాత్రమే. ఓవల్ లో అయితే నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక ఛేదన 263. 1902లో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన ఆసీస్.. ఆ టెస్టులో 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా ఇంగ్లీష్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

Scroll to load tweet…

మరి ఇప్పటికే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ లో సుమారు 300 ఆధిక్యంలో ఉంది. 400 ప్లస్ టార్గెట్ లక్ష్యంగా ఉంటే టీమిండియా దానిని ఛేదిస్తుందా..? ఛేదిస్తే మాత్రం చరిత్రే అవుతుంది. టీమిండియా గనక ఈ మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించే లక్ష్యాన్ని ఛేదించగలిగితే 121 ఏండ్ల రికార్డును బ్రేక్ చేసినట్టే అవుతుంది.

ఓవల్ లో భారత జట్టు నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక ఛేదన 173 పరుగులు. 1971లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఇండియా ఈ టార్గెట్ ను ఛేదించింది. ఇండియాకు ఇంగ్లాండ్ లో ఇదే ఫస్ట్ టెస్ట్ విజయం కావడం గమనార్హం. టీమిండియాకు అప్పుడు అజిత్ వాడేకర్ సారథిగా వ్యవహరించారు.

Scroll to load tweet…