Asianet News TeluguAsianet News Telugu

డివైన్ దంచెన్.. గుజరాత్ కొంప ముంచెన్.. ఒక్క పరుగుతో సెంచరీ మిస్.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో క్వాలిఫై ఆశలను ఇదివరకే  కోల్పోయిన   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్  కొంప ముంచింది.  ఆర్సీబీ బ్యాటర్ సోఫీ డివైన్ వీరవిహారం చేయడంతో ఆ జట్టు గుజరాత్ పై ఈజీ విక్టరీ కొట్టింది. 

WPL 2023: Sophie Devine Misses Hundred With 1 Run, RCB Beat GG by 8 Wickets  MSV
Author
First Published Mar 18, 2023, 10:38 PM IST

కుదిరితే సిక్స్.. లేదంటే ఫోర్.. బంతి బౌలర్ల చేతిలో నుంచి  విడుదలవడమే ఆలస్యం. బౌండరీ లైన్ దాటడానికి పెద్ద టైమ్ పట్టలేదు.   ఫీల్డర్లు పెద్దగా కష్టపడలేదు.  అంపైర్లు  ఎత్తిన చేయి దించలేదు. ఒకటే కొట్టుడు.. ఆ కొట్టుడుకు ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎఆర్ రెహ్మాన్ సంగీతానికి శివమణి డ్రమ్స్ వాయించినట్టుగా  గుజరాత్ బౌలర్లను వాయించింది సోఫీ డివైన్ (36 బంతుల్లో 99, 9 ఫోర్లు, 8 సిక్సర్లు). ఆడింది 36 బంతులే అయినా గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. 

20 బంతుల్లో అర్థ సెంచరీ..  తర్వాత 16 బంతుల్లోనే 49 పరగులు సాధించి ఒక్కటే పరుగుతో  సెంచరీ మిస్ చేసుకుంది.  సెంచరీ పోతే పోయిందేమో గానీ భారీ లక్ష్యాన్ని ‘ఉఫ్’ మని ఊదేసింది. డివైన్ దంచుడుకు స్మృతి మంధాన  క్లాస్, పెర్రీ దూకుడు తోడవడంతో 189 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ.. 15.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి  సాధించింది.  ఆర్సీబీ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్టే.  ఆర్పీబీ గెలుపుతో ఢిల్లీ ప్లేఆఫ్ప్ కు అర్హత  సాధించింది. ఇక మూడో స్థానం కోసం యూపీ వారియర్స్ బరిలో నిలిచింది.

భారీ లక్ష్య ఛేదనను  ఆర్సీబీ ధాటిగానే ఆరంభించింది. కిమ్ గార్త్ వేసిన  తొలి ఓవర్లోనే ఆర్సీబీకి 13 పరుగులొచ్చాయి.   గార్డ్‌నర్ వేసిన రెండో ఓవర్లో డివైన్  ఆమెకు చుక్కలు చూపెట్టింది.  ఆ ఓవర్లో డివైన్..  6, 4, 4, 6, 4 బాదింది. రెండో ఓవర్లో 24 పరుగులొచ్చాయి. 

తనూజా కన్వర్ వేసిన  నాలుగో ఓవర్లో మంధాన (31 బంతుల్లో 37,  5 ఫోర్లు, 1 సిక్సర్)  6, 4  కొట్టింది. నాలుగు ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 50 పరుగులు దాటింది.  ఇక గుజరాత్ సారథి స్నేహ్ రాణా వేసిన  ఐదో ఓవర్లో మంధాన, డివైన్ చెరో ఫోర్ బాదారు.  ఆ తర్వాత కిమ్ గార్త్ బౌలింగ్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. గార్డ్‌నర్ వేసిన  ఏడో ఓవర్లో  డివైన్ ఓ ఫోర్, సిక్స్ కొట్టింది. హర్లీన్ డియోల్ వేసిన  8వ ఓవర్లో ఐదో బంతికి భారీ సిక్సర్ బాదిన  డివైన్.. హాఫ్ సంచరీ సాధించింది. 20 బంతుల్లోనే ఆమె అర్థ సెంచరీ పూర్తయింది. ఇదే ఓవర్లో ఆర్సీబీ స్కోరు వంద పరుగులు దాటింది.  

ఆ ఒక్క పరుగు చేసుంటే.. 

హాఫ్ సెంచరీ తర్వాత కూడా డివైన్ అదే దూకుడును ప్రదర్శించింది.  కన్వర్ వేసిన 9వ ఓవర్లో  మూడు సిక్సర్లు, ఓ బౌండరీ  బాదింది. ఈ ఓవర్లో 25 పరుగులొచ్చాయి. డివైన్, మంధాన దూకుడు చూస్తే ఓపెనర్లిద్దరే  టార్గెట్ ఛేదిస్తారా..? అనిపించింది. కానీ స్నేహ్ రాణా వేసిన పదో ఓవర్లో రెండో బంతికి ఆమెకే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది.   మంధాన ఔటైనా డివైన్ దంచడం ఆపలేదు.   అశ్వని కుమారి  వేసిన   11వ ఓవర్లో  సిక్స్, ఫోర్ కొట్టి 90లలోకి వచ్చింది. కిమ్ గార్త్ వేసిన 12వ ఓవర్లో ఓ ఫోర్ తో పాటు మూడు డబుల్స్ తీసిన ఆమె..  సెంచరీకి ఒక్క పరుగు ముందు  అశ్వని కుమారికి క్యాచ్ ఇచ్చి  నిరాశగా వెనుదిరిగింది. ఈ మ్యాచ్  లో ఆమె ఆ ఒక్క పరుగు చేస్తే డబ్ల్యూపీఎల్ లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించేది.. 

 

డివైన్ నిష్క్రమించినా మిగతా లాంఛనాన్ని ఎలీస్ పెర్రీ (19 నాటౌట్), హెథర్ నైట్ (22 నాటౌట్) లు  పూర్తి చేశారు. ఈ విజయం తో ఆర్సీబీకి   ప్లేఆఫ్ అవకాశాలేమీ లేకపోయినా  సీజన్ మొత్తం నిరాశపడ్డ ఆ జట్టు అభిమానులకు  ఊరటనిచ్చే విజయాన్ని అందించింది. 

ఈ మ్యాచ్ లో మొదలు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల  నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో  ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ (68), ఆష్లే గార్డ్‌నర్  (41), సబ్బినేని మేఘన (31) లు రాణించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios