WPL: భారత మహిళల క్రికెట్ జట్టు సారథి  హర్మన్‌ప్రీత్ కౌర్  మరో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ లో ఆమె  నాయకత్వంలోనే ముంబై ముందడుగు వేయనున్నది. 

భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు సారథిగా వ్యవహరించనుంది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలంలో హర్మన్‌ప్రీత్ ను ముంబై.. రూ. 1.8 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా టీమిండియా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్న హర్మన్.. ఇప్పుడు ముంబై సారథిగా నడిపించనుంది. ఈ విషయాన్ని ఎంఐ ఓనర్ నీతా అంబానీ అధికారికంగా ప్రకటించారు. 

నీతా అంబానీ స్పందిస్తూ... ‘హర్మన్‌ప్రీత్ ను ముంబై ఇండియన్స్ మహిళల టీమ్ కు సారథిగా నియమిస్తున్నందుకు మేం చాలా సంతోషిస్తున్నాం. జాతీయ జట్టును నడిపిస్తున్న ఆమె.. ముంబై కోచింగ్ స్టాఫ్ జులన్ గోస్వామి, చార్లెట్ ఎడ్వర్డ్స్ ల సాయంతో మా జట్టుకు కూడా అవే తరహా విజయాలను అందిస్తుందని మేం ఆశిస్తున్నాం... 

ఎంఐ కొత్త అధ్యాయంలోకి అడుగిడుతున్న తరుణాన మేం చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాం. తొలి సీజన్ లో మా మహిళల జట్టు ఫీయర్లెస్ క్రికెట్ ఆడుతూ ఎంఐ అభిమానులను అలరిస్తుందని మేం ధీమాగా ఉన్నాం. హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ కో.కు మా తరఫున శుభాకాంక్షలు..’అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ముంబై జట్టు తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 4న గుజరాత్ జెయింట్స్ తో ఆడనుంది. డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ తో తొలి సీజన్ మొదలుకానుంది. కాగా ముంబై జట్టుకు సారథిగా ఎంపికైన హర్మన్‌ప్రీత్ టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. పురుషుల క్రికెట్ లో కూడా రోహిత్ శర్మ భారత జట్టుకు సారథి కాగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కూ అతడే కెప్టెన్. జాతీయ జట్టుకు సారథులుగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లో కూడా ఒకే టీమ్ కు ఆడుతుండటం విశేషం. 

Scroll to load tweet…

ముంబై టీమ్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) , నటాలీ సీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్‌‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్, హీలి మాథ్యూస్, హుమైరా కాజి, ప్రియాంక బాలా, చోల్ టైరన్, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్త్ 

హర్మన్‌ప్రీత్ ను సారథిగా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నాలుగు జట్లు తమ కెప్టెన్లను ప్రకటించినట్టు అయింది. ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇంకా వాళ్ల సారథిని అధికారికంగా ప్రకటించలేదు. నలుగురు కెప్టెన్ల జాబితా ఇదే.. 

ఆర్సీబీ : స్మృతి మంధాన 
యూపీ : అలీస్సా హీలి 
గుజరాత్ : బెత్ మూనీ 
ముంబై : హర్మన్‌ప్రీత్ కౌర్ 

ఢిల్లీ : ప్రకటించాల్సి ఉంది