స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల వాంచను పూర్తిచేసుకుంది. క్రికెట్ కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ కు అందనాద్రాక్షల మిగిలిన ఐసిసి వన్డే ప్రపంచ ట్రోఫీని అందుకోవాలన్న కల ఇప్పటికి నెరవేరింది.  అయితే అదే ట్రోఫీని ఈసారి ఎలాగైనా సాధించాలన్న న్యూజిలాండ్ కల వరుసగా రెండోసారి కూడా నెరవేరలేదు. 2015 లో ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచిన కివీస్ కు ఈసారి కూడా ఫైనల్ చేరినా తుది పోరులో విజేతగా నిలవలేకపోయింది. ఇలా ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైనప్పటికి మా ఆటతీరు పట్ల ఎంతో గర్వంగా ఫీలవుతున్నట్లు మార్టిన్ గప్తిల్ తాజాగా పేర్కొన్నాడు. 

ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మార్టిన్ గప్తిల్ ఒక్కసారి కూడా ఈ మ్యాచ్ గురించి స్పందించలేదు. ట్రోఫీని కోల్పోయామన్న మనస్థాపంతో సోషల్ మీడియా మాద్యమాలకు కూడా గతవారం రోజులుగా దూరంగా వున్నాడు. అయితే తాజాగా అతడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచ కప్ టోర్నీ ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ పై స్పందించాడు. 

''లార్స్డ్ వేదికన జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ ముగిసి అప్పుడే వారం రోజులయ్యింది. దీన్ని అసలు నమ్మలేకపోతున్నా. ఈ మ్యాచ్ జరిగిన రోజు నా క్రికెట్ కెరీర్ లోనే అత్యంత చెడ్డ రోజు....అలాగే మంచి రోజు కూడా. చాలా రకాల భావోద్వేగాలు ఈ మ్యాచ్ ద్వారా కలిగాయి.  అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికి న్యూజిలాండ్ జట్టు తరపున ఆడటమే గర్వంగా ఫీలవుతున్నా. అంతేకాకుండా బ్లాక్ క్యాప్ టీమ్ ఆటగాళ్లతో కలిసి ఆడటమే చాలా గర్వకారణం. తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. '' అంటూ గప్తిల్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. 

ఫైనల్లో మ్యాచ్ లో గప్తిల్ ఓవర్ త్రో కారణంగానే కివీస్ ఓటమిపాలయ్యిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా డెత్ ఓవర్లలో అతడి ఓవర్ త్రో ఇంగ్లాండ్ కు ఏకంగా ఆరు పరుగులను అందించింది. ఇలా జరక్కపోయుంటే అసలు మ్యాచ్ టై, సూపర ఓవర్ టై అన్న ప్రస్తావనే వచ్చేది కాదని కివీస్ అభిమానులే కాదు క్రికెట్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. చివరకు ఆ న్యూజిలాండ్ ను దురదృష్టం వెంటాడటంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ప్రపంచ విజేతగా నిలిచిందని...ఈ ఓటమిలో గప్తిల్ పాత్ర మరిచేపోలేనిదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.