Women's Asia Cup 2022 Final: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక... ఇరు జట్ల మధ్య ఐదోసారి ఆసియా కప్ ఫైనల్...

వుమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శ్రీలంక జట్టు కెప్టెన్ చమరీ ఆటపట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత మహిళా జట్టు, రికార్డు స్థాయిలో 8వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే... శ్రీలంక మహిళా జట్టుకి ఇది ఐదో ఆసియా కప్ ఫైనల్. అయితే గతంలో శ్రీలంక ఆడి ఓడిన నాలుగు ఫైనల్స్ కూడా టీమిండియాపైనే కావడం విశేషం... 

నెల రోజుల క్రితం పురుషుల ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2018లో ఆసియా కప్ నెగ్గిన టీమిండియా, డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో 2022 టోర్నీని ఆరంభించింది. అయితే సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో వరుస మ్యాచుల్లో ఓడిన టీమిండియా, ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది...

నెల రోజుల తర్వాత నేడు భారత మహిళా జట్టు, వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్ ఆడబోతోంది. గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన టీమిండియా, మిగిలిన అన్ని మ్యాచుల్లో నెగ్గి టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింద. సెమీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌ని చిత్తు చేసి, రికార్డు స్థాయిలో ఏడోసారి వుమెన్స్ ఆసియా కప్ ఫైనల్ ఆడబోతోంది...

2004 నుంచి ఇప్పటిదాకా ఏడు ఎడిషన్లలో వుమెన్స్ ఆసియా కప్ టోర్నీ జరగగా అందులో ఆరుసార్లు టీమిండియానే టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 2018 ఆసియా కప్ ఫైనల్ చేరిన టీమిండియా, బంగ్లాదేశ్ చేతుల్లో 3 వికెట్ల తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది... ఆ పరాజయాన్ని మరిచిపోవాలంటే నేటి మ్యాచ్‌లో మరోసారి ఆసియా విజేతగా నిలవాలని చూస్తోంది భారత మహిళా జట్టు...

ఇండియా, శ్రీలంక జట్ల మధ్య వుమెన్స్ ఆసియా కప్ ఫైనల్ జరగడం ఇది ఐదోసారి. ఇంతకుముందు 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన 2004, 2005, 2006, 2008 సీజన్లలో జరిగిన ప్రతీ ఫైనల్ మ్యాచుల్లో లంకను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. టీ20 ఫార్మాట్‌లో శ్రీలంక ఎప్పుడూ ఆసియా కప్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో వుమెన్స్ ఆసియా కప్‌ ఫైనల్‌లో తొలిసారి తలబడబోతున్నాయి ఇండియా, శ్రీలంక...

యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాతో పాటు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ బౌలింగ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. 

భారత జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

శ్రీలంక జట్టు: ఛమరీ ఆటపట్టు (కెప్టెన్), అనుష్క సంజీవని, హర్షిత మాధవి, హసిని పెరేరా, నిలాక్షి డి సిల్వ, కవిష దిల్హారి, మల్షా స్నేహని, ఓసాడి రణసింగే, సుగంధిక కుమారి, ఐనోక రణవీర, అచిని కులసురియ