ఫైనల్ మ్యాచ్‌ల ో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసిన శ్రీలంక... 3 వికెట్లు తీసిన రేణుకా సింగ్...
వుమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచామనే సంతోషం లంకలో కొద్దిసేపు కూడా నిలవకుండానే వరుస విరామాల్లో వికెట్లు తీసి ముప్పు తిప్పలు పెట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. 43 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన లంక, ఆఖరి వికెట్ భాగస్వామ్యం వల్ల ఆలౌట్ కాకుండా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. ..
దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్‌లో 3 పరుగులు రాగా రెండో ఓవర్‌లో రేణుకా సింగ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి బౌండరీ బాదింది లంక కెప్టెన్ ఛమరీ ఆటపట్టు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఛమరీ ఆటపట్టు, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక జట్టు... వుమెన్స్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో రనౌట్ అయిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచింది ఆటపట్టు...
రేణుకా సింగ్ వేసిన నాలుగో ఓవర్‌లో హై డ్రామా నడిచింది. మూడో బంతికి లంక బ్యాటర్ మాధవి, వికెట్ కీపర్ రిచా ఘోష్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఆ తర్వాతి బంతికి సంజీవని, సమన్వయ లోపంతో రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. మూడో బంతికి హసినీ పెరేరా వస్తూనే బంతిని గాల్లోకి లేపి స్మృతి మంధానకి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యింది...
వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక జట్టు... ఆ తర్వాతి ఓవర్‌లో కవిషా దిల్షరీని క్లీన్ బౌల్డ్ చేసింది రేణుకా సింగ్. క్రీజులోకి వచ్చిన ఓషడి రణసింగే పరుగులేమీ చేయకపోవడంతో ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ని వికెట్ మెయిడిన్‌గా ముగించింది రేణుకా సింగ్. ఏడో ఓవర్‌లో రాజేశ్వరి గైక్వాడ్ కూడా వికెట్ తీయడంతో ఆరో వికెట్ కోల్పోయింది శ్రీలంక...
8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన నీలాక్షి డి సిల్వ, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 5 బంతులు ఆడిన స్నేహని, స్నేహ్ రాణా బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యింది. 20 బంతుల్లో 13 పరుగులు చేసిన రణసింగేని రాజేశ్వరి గైక్వాడ్ క్లీన్ బౌల్డ్ చేసింది...
24 బంతుల్లో 6 పరుగులు చేసిన సుగంధిక కుమారి కూడా స్నేహ్ రాణా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో 43 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది శ్రీలంక. అయితే ఆఖరి వికెట్‌కి అచిని కులసూరియ, ఐనోక రణవీర కలిసి 22 బంతుల్లో 24 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అచినీ 6 పరుగులు చేయగా రణవీర 22 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసింది....
భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 5 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీశారు. మరో ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు.
