Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఆసియా కప్ ఫైనల్: రేణుకా సెన్సేషనల్ స్పెల్... 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంక...

18 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన శ్రీలంక... ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయిన లంక... 

Womens Asia Cup 2022 Final: Renuka Singh Sensational bowling, sri lanka lost early wickets
Author
First Published Oct 15, 2022, 1:40 PM IST

వుమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ సెన్సేషనల్ స్పెల్‌తో చెలరేగిపోయింది. 3 ఓవర్లలో 3 వికెట్లు తీసిన రేణుకా సింగ్ బౌలింగ్ కారణంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మహిళా జట్టు 16 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది...

దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్‌లో 3 పరుగులు రాగా రెండో ఓవర్‌లో రేణుకా సింగ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి బౌండరీ బాదింది లంక కెప్టెన్ ఛమరీ ఆటపట్టు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఛమరీ ఆటపట్టు, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక జట్టు...

రేణుకా సింగ్ వేసిన నాలుగో ఓవర్‌లో హై డ్రామా నడిచింది. మూడో బంతికి లంక బ్యాటర్ మాధవి, వికెట్ కీపర్ రిచా ఘోష్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఆ తర్వాతి బంతికి సంజీవని, సమన్వయ లోపంతో రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. మూడో బంతికి హసినీ పెరేరా వస్తూనే బంతిని గాల్లోకి లేపి స్మృతి మంధానకి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యింది...

వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక జట్టు... ఆ తర్వాతి ఓవర్‌లో కవిషా దిల్షరీని క్లీన్ బౌల్డ్ చేసింది రేణుకా సింగ్. క్రీజులోకి వచ్చిన ఓషడి రణసింగే పరుగులేమీ చేయకపోవడంతో ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ని వికెట్ మెయిడిన్‌గా ముగించింది రేణుకా సింగ్. ఏడో ఓవర్‌లో రాజేశ్వరి గైక్వాడ్ కూడా వికెట్ తీయడంతో ఆరో వికెట్ కోల్పోయింది శ్రీలంక...

8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన నీలాక్షి డి సిల్వ, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. అంతకుముందు  టాస్ నెగ్గిన శ్రీలంక జట్టు కెప్టెన్ చమరీ ఆటపట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత మహిళా జట్టు, రికార్డు స్థాయిలో 8వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే... శ్రీలంక మహిళా జట్టుకి ఇది ఐదో ఆసియా కప్ ఫైనల్. అయితే గతంలో శ్రీలంక ఆడి ఓడిన నాలుగు ఫైనల్స్ కూడా టీమిండియాపైనే కావడం విశేషం... 

ఇండియా, శ్రీలంక జట్ల మధ్య వుమెన్స్ ఆసియా కప్ ఫైనల్ జరగడం ఇది ఐదోసారి. ఇంతకుముందు 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన 2004, 2005, 2006, 2008 సీజన్లలో జరిగిన ప్రతీ ఫైనల్ మ్యాచుల్లో లంకను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. టీ20 ఫార్మాట్‌లో శ్రీలంక ఎప్పుడూ ఆసియా కప్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios