భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానం వినపడుతోంది. ఇటీవల గంగూలీ... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. 2021లో పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ఆయనను నిలబెట్టాలని కేంద్రంలోని పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే ఇప్పుడు బీసీసీఐ పదవి గంగూలీకి కట్టబెడుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. అయితే... గంగూలీ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి అలాంటి రాజకీయ పరిణామాలు ఏమీ లేవని తేల్చి చెప్పారు. అమిత్  షాతో భేటీలో తాము అలాంటి విషయాలు చర్చించలేదని విరవించారు. అయితే... ఆ వార్తలు నిజం కాదని గంగూలీ తీసిపారేయలేదని.. కేవలం ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని మాత్రమే చెప్పారని పలువురు అంటున్నారు.

ఇదిలా ఉండగా...భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  సుప్రీం కోర్టు ఆదేశాలతో 2017లో అనురాగ్ ఠాకూర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక 33 నెలల క్రికెట్ పరిపాలన కమిటీ పాలన అనంతరం బీసీసీఐ పగ్గాలు దాదా చేతికి చిక్కనున్నాయి.

ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌లోని 8 స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా అందరూ ఎన్నిక కావడం విశేషం. అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న అందరూ అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ నేపథ్యంలో గంగూలీ ఓ ఫోటోని సోషల్ మీడియాలో  షేర్ చేశారు. బీసీసీఐ కొత్త టీం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఫోటోలో  గంగూలీతోపాటు అనురాగ్ ఠాకూర్, జై షా, అరుణ్ ధామల్, జయేశ్ జార్జ్ లు ఉన్నారు. తామంతా కలిసి మంచిగా పనిచేస్తామని తాను నమ్ముతున్నానంటూ గంగూలీ పేర్కొన్నారు. అనంతరం అనురాగ్ ఠాకూర్ ని ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు. 

 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా బిసిసిఐ కార్యదర్శిగా ఎన్నికవుతున్నారు. అరుణ్ ధమాల్ బిసిసిఐ కొత్త కోశాధికారిగా ఎన్నికవుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన 47 గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ కూడా పోటీ చేయడానికి ప్రయత్నించారు. బ్రిజేష్ పటేల్ ను ఎన్. శ్రీనివాసన్ ను బలపరిచారు. అయితే, బ్రిజేష్ పటేల్ అభ్యర్థిత్వానికి సరైన మద్దతు లభించలేదు.