Asianet News TeluguAsianet News Telugu

నాన్న కల.. అమ్మ ఆశయం.. అన్న అండ = టీమిండియా నయా సూపర్ స్టార్ రేణుకా సింగ్ ఠాకూర్

CWG 2022: టీమిండియా మహిళా  క్రికెట్ లో రేణుకా సింగ్ ఠాకూర్ ఒక సంచలనంలా దూసుకొచ్చింది. పట్టుమని పది మ్యాచులు ఆడకున్నా ఆస్ట్రేలియా వంటి జట్టను వణికించి భారత్ ను సెమీస్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. 
 

Who is Renuka Singh Thakur, Know Interesting Details New Team India Super Star
Author
India, First Published Aug 4, 2022, 1:18 PM IST

కామన్వెల్త్ గేమ్స్ -2022లో భాగంగా  భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్ లో ఆసీస్ తో పోటీ పడింది. తొలి మ్యాచ్ లో భారత్ ముందు బ్యాటింగ్ చేసి 155 పరుగులు చేసింది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ కు అదేం పెద్ద కష్టం కాదనుకున్నారంతా. రెండో ఇన్నింగ్స్ లో కంగారూలు బ్యాటింగ్ కు వచ్చారు. కళ్లు మూసి తెరిచేలోపు వికెట్లు నేలకూలుతున్నాయి. ఓపెనర్ అలీస్సా హీలి డకౌట్ అయింది. బెత్ మూనీ  క్లీన్ బౌల్డ్ అయింది. కెప్టెన్ మెగ్ లానింగ్ దీ అదే దారి. తహిలా మెక్‌గ్రాత్.. రయ్యిమని దూసుకొచ్చిన ఇన్ స్వింగర్ ను ఎలా ఆడాలో తెలియక  బ్యాట్ ను అడ్డం పెట్టినా బంతి వెళ్లి మిడిల్ స్టంప్ ను పడగొట్టింది. అంతా షాక్.  ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.  

34 పరుగులకే ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. అవన్నీ ఒక్క బౌలర్ ఖాతాలోనే. అలా అని ఆమె ఏమైనా కాకలు తీరిన బౌలరా..? అంటే అదికాదు.  గట్టిగా చెప్పాలంటే అది ఆమెకు నాలుగో మ్యాచ్. కానీ కంగారూలకే కంగారు పుట్టించింది. ఓడిపోతామేమో అన్న భయాన్ని కలిగించింది. నాలుగు వికెట్లతో చెలరేగిన ఆ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్. 

జులన్ గోస్వామి తర్వాత భారత మహిళా క్రికెట్ కు ఆశాకిరణం (బౌలర్లలో) గా కనిపిస్తున్న రేణుకా సింగ్ ఠాకూర్‌ది హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్రు.  ప్రముఖ ఆద్యాత్మిక స్థలం ధర్మశాలకు 325 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ చిన్న టౌన్. సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ్నుంచి కొండలు, కోనలు దాటుకుని టీమిండియాలోకి చేరింది రేణుకా ఠాకూర్. 

తండ్రి కాంబ్లీకి అభిమాని.. 

రేణుక తండ్రి కేహర్ సింగ్ ఠాకూర్ కు క్రికెట్ అంటే అభిమానం. ఆయన టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి వీరాభిమాని. తన సంతానం (ఒక కొడుకు, కూతురు) లో ఒకరినైనా క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. అందుకే తన కొడుకుకు వినోద్ అని తన అభిమాన క్రికెటర్ పేరు పెట్టుకున్నాడు. కేహర్ హిమాచల్ ప్రదేశ్ లో ఇరిగేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ లో  పనిచేసేవాడు.  కానీ రేణుక మూడేండ్ల వయసులోనే అతడు మరణించాడు. దీంతో  ఆ ఉద్యోగాన్ని రేణుక అమ్మకు ఇచ్చారు. వినోద్ తో పాటే  రేణుక కూడా చిన్నప్పుడే క్రికెట్ పై మక్కువ పెంచుకుంది. తన అన్న ఎక్కడికెళ్లినా తానూ  అక్కడికెళ్లి బౌలింగ్ చేసేది. 

తల్లి  కష్టాలు.. 

తండ్రి చనిపోయాక  ఆ ఉద్యోగాన్ని రేణుక తండ్రికి ఇచ్చినా  చాలీచాలని జీతాలతో జీవితాలు సాఫీగా ఏం సాగలేదు. కూతురు, కొడుకు లోని  ఇద్దరి ఆసక్తిని గమనించిన తల్లి.. ఇద్దరికీ ఖర్చు పెట్టే స్థోమత లేక వినోద్ కు నచ్చజెప్పింది. రేణుకను ప్రోత్సహించింది. తమ గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడ టోర్నీలు జరిగినా వినోద్.. తన చెల్లిని తీసుకెళ్లి  క్రికెట్ ఆడించేవాడు. 

 

రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఎంపిక.. 

ఆ క్రమంలో రేణుకకు 14 ఏండ్ల వయసులో  ఆమె హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అకాడమీకి ఎంపికైంది.  అక్కడ ఆమె రాటుదేలింది.  ఆ తర్వాత  2018-19 సీజన్ లో  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఆడుతూ   21 వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమె జాతీయ జట్టు సెలక్టర్ల   దృష్టిలో పడింది.  ఆ తర్వాత ఛాలెంజర్ ట్రోఫీ, ఇండియా-ఏ జట్లకు ఎంపికైంది. 

ఎంపికైనా అవకాశాలు రాక.. 

జట్టుకు ఎంపికైనా రేణుకాకు అవకాశాలు రాలేదు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో ఆమె ఎంపికైంది. అయితే అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ ఛాన్స్ శ్రీలంక సిరీస్ ద్వారా వచ్చింది. లంకేయులను ముప్పుతిప్పలు పెట్టడంతో ఆమె  కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనబోయే  జట్టుకు ఎంపికైంది.  ఆసీస్ తో ఆడిన తొలి మ్యాచ్ లో  4 వికెట్లు తీసింది. ఆ తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఒక వికెట్ తీసినా పొదుపుగా బౌలింగ్ చేసింది. ఇక బుధవారం  బార్బడోస్ తో ముగిసిన కీలక మ్యాచ్ లో కూడా నాలుగు వికెట్లు పడగొట్టి  భారత్ ను సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios