Wriddhiman Saha: ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లు అంతగా రాణించడం లేదు. కానీ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
‘మేం కొత్త వికెట్ కీపర్ ను తయారుచేయాలనుకుంటున్నాం. రిషభ్ పంత్ కు బ్యాకప్ గా ఆల్ ఫార్మాట్ కీపర్ మాకు కావాలి. నీకు ఎలాగూ వయసు కూడా అయిపోతుంది కదా.. ఇక టెస్టులకు కూడా నిన్ను ఎంపిక చేయడం కష్టమే.. నీకు నువ్వుగా రిటైర్ అయితే బెటర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకైతే చోటు దక్కదు...’ సరిగ్గా రెండు నెలల క్రితం టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో భారత జాతీయ జట్టు సెలెక్షన్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు అన్న మాటలవి. ఐపీఎల్ కు ముందు భారత్ కు వచ్చిన శ్రీలంకతో రెండు టెస్టులకు గాను అతడిని ఎంపికచేయబోమని మన సెలెక్టర్లు సాహాతో పై విధంగా సెలవిచ్చారు.
కట్ చేస్తే.. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఆ జట్టు విజయాలలో వృద్ధిమాన్ సాహా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఓపెనర్ గా వచ్చి దుమ్మురేపుతున్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ తరఫున 8 మ్యాచులాడిన సాహా.. 277 పరుగులు చేశాడు.
బీసీసీఐ సెలెక్టర్లు చెప్పిన రిషభ్ పంత్ గానీ.. ఇషాన్ కిషన్ గానీ.. మరికొంతమంది ఔత్సాహిక వికెట్ కీపర్లు గానీ సాహా కంటే గొప్పగా ఆడిందైతే లేదు. రిషభ్ పంత్.. 12 మ్యాచుల్లో 294 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 12 మ్యాచులలో 327 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి కంటే సాహా.. నాలుగు మ్యాచులు తక్కువగానే ఆడాడు.
ఈ సీజన్ లో 8 మ్యాచులలో సాహా.. పవర్ ప్లే లో దుమ్ము దులుపుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు.. రూ. 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన శుభమన్ గిల్ సైతం పలు మ్యాచుల్లో తడబడుతున్నా సాహా మాత్రం వీరవిహారం చేస్తున్నాడు. ఈ సీజన్ లో సాహా.. ఓపెనర్ గా బరిలోకి దిగి 37 ఏండ్ల వయసులో కూడా గిల్ కంటే దూకుడుగా ఆడుతుండటం గమనార్హం. హైదరాబాద్ తో మ్యాచ్ లో 38 బంతుల్లోనే 68 పరుగులు చేసిన సాహా.. ముంబైతో (40 బంతుల్లో 55), చెన్నైతో (67) తో మ్యాచులలో పవర్ ప్లే లో రాణిస్తున్నాడు.
సాహా తాజా ప్రదర్శన చూస్తుంటే టీ20 ప్రపంచకప్ 2022 లో వికెట్ కీపర్ బ్యాటర్ కోసం తాను కూడా పోటీ పడుతున్నట్టే కనిపిస్తున్నది. భారత క్రికెట్ కు చాలాకాలంగా సేవలందిస్తున్న సాహా కు అనుకున్న గుర్తింపు దక్కలేదు. ఇటీవలే అతడికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ప్రముఖ క్రీడా జర్నలిస్టు బొరియా మజుందార్.. అతడిని బెదిరించి బీసీసీఐ నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో తనను ఎంపిక చేయని కారణంగా ఆ పట్టుదలతో కసిగా ఆడుతున్న సాహా.. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని చెప్పకనే చెబుతున్నాడు. 37 ఏండ్ల వయసులో కూడా కుర్రాళ్లతో పోటీ పడుతున్న సాహాను తిరిగి టీ20 జట్టులోకి తీసుకువస్తారా..? అనే ప్రశ్నకు బీసీసీఐ సెలెక్టర్లే సమాధానం చెప్పాలి మరి..
ఈ సీజన్ లో సాహా స్కోర్లు : 11, 25, 68, 29, 21, 55, 5, 67 (మొత్తం 277)
ఐపీఎల్ లో 2008 నుంచి ఆడుతున్న సాహ.. ఇప్పటిరవకు 2014 సీజన్ లో (362) మినహా మిగిలిన ఏ సీజన్ లో కూడా ఇన్ని పరుగులు చేయలేదు. ఇంత ధాటిగా కూడా ఆడిన దాఖలాల్లేవు.
