Asianet News TeluguAsianet News Telugu

భారత్ టూర్‌కి జట్టుని ప్రకటించిన వెస్టిండీస్... కీమర్ రోచ్‌కి పిలుపు...

రెండున్నరేళ్ల తర్వాత వన్డేల్లోకి కీమర్ రోచ్... శుక్రవారం టీ20 సిరీస్‌కి జట్టును ప్రకటించనున్న వెస్టిండీస్... మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయాన్ని అందుకున్న విండీస్ సేన...

West Indies announced Squad for India tour, Kemar Roach gets call, Kieron Pollard
Author
India, First Published Jan 27, 2022, 1:20 PM IST

ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్, వచ్చే నెలలో భారత్‌లో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే భారత్ టూర్‌లో వెస్టిండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు ఆడుతుంది...

ఇప్పటికే వెస్టిండీస్‌తో సిరీస్‌కి భారత జట్టు వన్డే, టీ20 జట్లను ప్రకటించగా... తాజాగా భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించింది విండీస్. సీనియర్ బౌలర్ కీమర్ రోచ్‌కి తిరిగి వన్డే జట్టులోకి పిలుపునిచ్చారు సెలక్టర్లు...

కిరన్ పోలార్డ్ కెప్టెన్సీలో భారత్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది విండీస్. టీ20 సిరీస్ ఆడే జట్టును శుక్రవారం (జనవరి 28న) ప్రకటించనుంది విండీస్ బోర్డు... కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీ20 సిరీస్‌ను కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా, వన్డే సిరీస్2ను అహ్మదాబాద్‌లోని మొతేరా నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించబోతున్నారు...

2019లో ఇండియాపైనే చివరి వన్డే మ్యాచ్ ఆడిన కీమర్ రోచ్, దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. తన కెరీర్‌లో 92 వన్డేలు ఆడిన కీమర్ రోచ్, 124 వికెట్లు తీశాడు...

భారత్‌తో వన్డే సిరీస్‌కి వెస్టిండీస్ జట్టు ఇది: కీరన్ పోలార్డ్ (కెప్టెన్), ఫ్యాబియన్ ఆలెన్, ‘న్క్రుమా బోన్నర్, జాసన్ హోల్డర్, షై హోప్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్, కీమర్ రోచ్, రొమారియో షెఫర్డ్, ఓడెన్ స్మిత్, హేడన్ వాల్ష్ జూనియర్, డారెన్ బ్రావో, షెమర్ బ్రూక్స్...

ఫిబ్రవరి 6న మొదటి వన్డే, ఫిబ్రవరి 9న రెండో వన్డే, ఫిబ్రవరి 11న ఆఖరి వన్డే మ్యాచ్ జరుగుతాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతోంది వెస్టిండీస్. మొదటి టీ20లో 9 వికెట్ల తేడాతో గెలిచిన వెస్టిండీస్, రెండో టీ20లో 1 పరుగు తేడాతో ఓడింది...  

మూడో టీ20 మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్, 2-1 తేడాతో ఆధిక్యం దక్కించుకుంది. మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోరు చేసింది...

బ్రెండన్ కింగ్ 10, షై హోప్ 4, ఫ్యాబియన్ ఆలెన్ డకౌట్ కాగా నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. 53 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్... టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు...

లక్ష్యఛేదనలో టామ్ బంటన్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 పరుగులు చేసి పోరాడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగలిగింది ఇంగ్లాండ్...

ఇరు జట్లు కలిసి 448 పరుగులు చేసి, వెస్టిండీస్‌లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా రికార్డు నెలకొల్పాయి. జనవరి 30న ఆఖరి 20 మ్యాచ్ ఆడే వెస్టిండీస్ ఆ తర్వాత ఇండియా పర్యటనకు రానుంది. 

టీ20 సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, రవి భిష్ణోయ్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్...

వన్డే సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవిభిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్... 

Follow Us:
Download App:
  • android
  • ios