Virat Kohli's 71st Century: రన్ మిషీన్ విరాట్ కోహ్లి ఆఖరుసారి సెంచరీ చేసింది 2019లో.. అప్పట్నుంచి పలు టెస్టులు, వన్డేలు ఆడిన భారత్ కు విజయాలైతే సాధించిపెట్టాడు కానీ...
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయక రెండున్నరేండ్లు దాటింది. చివరిసారిగా కోహ్లి 2019 నవంబర్ లో తన సెంచరీని నవంబర్ 2022 లో సాధించాడు. అప్పట్నుంచి ఈ పరుగుల యంత్రం నుంచి సెంచరీ కోసం అతడి అభిమానులు వేయి కండ్లతో వేచి చూస్తున్నారు. అయితే శ్రీలంకతో ఆదివారం ముగిసిన తొలి టెస్టు.. కోహ్లి టెస్టు కెరీర్ లో వందో టెస్టు. ఈ మ్యాచులో అయినా కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా ఊహించారు. కానీ అభిమానుల కోరికను మరోసారి అతడు నెరవేర్చలేదు. ఇదిలాఉండగా.. పాకిస్థాన్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కూడా కోహ్లి సెంచరీ ప్రస్తావన వచ్చింది.
రావల్పిండి టెస్టులో ఆసీస్-పాక్ తొలి టెస్టు జరుగుతుండగా.. అక్కడి కెమెరాల కన్ను ఓ ప్రేక్షకుడు పట్టుకున్న పోస్టర్ మీదకు వెళ్లాయి. ఈ టెస్టుతో సంబంధం లేని పోస్టర్ ను అతడు పట్టుకున్నాడు.
ఆ పోస్టర్ మీద.. ‘కోహ్లి.. నీ 71వ సెంచరీ పాకిస్థాన్ మీద సాధించాలని మేము కోరుకుంటున్నాం..’ అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విరాట్ సెంచరీ గురించి ఆకాంక్షిస్తున్న అభిమానితో పాటు ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య జరుగబోయే మ్యాచ్ ను అతి పెద్ద మ్యాచుగా అభివర్ణిస్తూ మరో అభిమాని పోస్టర్ పట్టుకుని కనిపించాడు. అందులో ‘అతి పెద్ద మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. రోహిత్ వర్సెస్ షాహీన్’ అని ఉంది.
ఇదిలాఉండగా పాకిస్థాన్ లో కోహ్లి సెంచరీ సాధించాలనే అతడి అభిమాని కోరిక నెరవేరకపోవచ్చు. ఎందుకంటే గత దశాబ్దకాలంగా పాక్ తో నెలకొన్న సరిహద్దు సమస్యలతో భారత్ ఆదేశంతో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. చివరిసారిగా భారత్ 2008లో పాక్ లో పర్యటించింది. అప్పటికీ కోహ్లి భారత జట్టులొ భాగం కాలేదు. ఇక కొద్దిరోజులగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లను జరగడం లేదు. కానీ ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నీలలో మాత్రమే రెండు జట్లు ఢీకొంటున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఇప్పట్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ జరుగడం కూడా కచ్చితంగా కష్టమే.. అయితే ఈ అభిమాని కల కలగా మిగిలిపోవాల్సిందే.
