ఇలాంటి ఛాలెంజింగ్ పిచ్ కావాలని అడిగాం! తొలి ఇన్నింగ్స్‌లో 200 చేసి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది... బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమికి కారణం... - టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్..
కేప్‌టౌన్ టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ నుంచి టెస్టు పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా స్వదేశంలో శ్రీలంకపై రెండు, ఆస్ట్రేలియాపై రెండు విజయాలు అందుకున్న రోహిత్‌కి మూడో టెస్టుకి తొలి పరాజయం ఎదురైంది. భారత కెప్టెన్‌గా మొదటి నాలుగు టెస్టుల్లో నెగ్గిన రెండో సారథిగా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో మొదటి నాలుగు టెస్టుల్లో గెలిచిన భారత జట్టు, ఐదో టెస్టును డ్రా చేసుకుంది...
రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొదటి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్నా, ఇండోర్ టెస్టులో టీమిండియాకి షాక్ తగిలింది. మొదటి 2 మ్యాచుల్లో టాస్ ఓడి, మ్యాచులు గెలిచిన భారత జట్టు, మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని చాలా పెద్ద మిస్టేక్ చేసింది...
ఇండోర్ టెస్టు సరిగ్గా ఆరున్నర సెషన్లలోనే ముగిసింది. మొత్తంగా 1135 బంతుల్లోనే ఓడిన భారత జట్టు, స్వదేశంలో చెత్త రికార్డు మూటకట్టుకుంది. ఇంతకుముందు కాన్పూర్‌లో 1951-52 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 1459 బంతులాడి ఓడింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో కనీసం 1150 బంతులు కూడా ఆడలేదు భారత బ్యాటర్లు...
‘ఓ టెస్టు మ్యాచ్ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 200 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండి ఉండేది. తొలి ఇన్నింగ్స్‌లో వాళ్లకు దక్కిన 80-90 పరుగులు మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేశాయి...
రెండో ఇన్నింగ్స్‌లో కూడా అనుకున్నంత స్కోరు చేయలేకపోయాం. కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. ఒకవేళ తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడి ఉంటే సీన్ మారిపోయి ఉండేది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించలేదు కానీ మాకు ఇంకా ఛాన్స్ ఉంది...
అహ్మదాబాద్ టెస్టులో గెలిచి, ఫైనల్ చేరతాం. తొలి రెండు టెస్టుల్లో గెలవడానికి ఏం చేయాలో అది చేశాం. పిచ్ ఎలా ఉన్నా పరుగులు చేయడానికి ఏం చేయాలో మాకు తెలుసు. కాస్త ధైర్యంగా, కొంచెం దూకుడు చూపిస్తే పరుగులు రాబట్టడం కష్టమేమీ కాదు..
బౌలర్లు చాలా కష్టపడ్డారు. మొదటి రెండు టెస్టుల్లో విజయాలకు వాళ్లే కారణం. టీమ్‌లో కొందరు ప్లేయర్ల నుంచి రావాల్సిన పర్ఫామెన్స్ రావడం లేదు. వాళ్లు కూడా చేతులు కలిపితే గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. పిచ్ ఎలా ఉండాలనేది సిరీస్ ఆరంభానికి ముందే నిర్ణయం తీసుకున్నాం...
పిచ్ ఎలా ఉండబోతున్నాయో మాకు తెలుసు. ఎలాంటి ఛాలెంజ్‌కైనా బ్యాటర్లు సిద్ధంగా ఉండాలని ముందుగానే చెప్పాం. ఇది టీమ్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. పిచ్ వల్లే ఓడిపోయామని చెప్పడం కరెక్ట్ కాదు. చాలామంది షాట్ సెలక్షన్ సరిగ్గా లేదు, నాతో సహా... బ్యాటింగ్‌లో మేం చేసిన తప్పులే ఈ ఓటమికి కారణం...
ఐదు రోజుల టెస్టులను చూడడానికి జనాలు ఇష్టపడడం లేదు. విదేశాల్లో కూడా టెస్టులు ఐదు రోజుల పాటు సాగడం లేదు. సౌతాఫ్రికాలో టెస్టులు 3 రోజుల్లోనే ముగిశాయి. పాకిస్తాన్‌లో 5 రోజులు టెస్టులు సాగితే, జనాలు బోర్ ఫీల్ అయ్యారు. కాస్త ఆసక్తికరంగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. మేం అదే చేస్తున్నాం.. ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
