ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు..? పీసీబీపై పాక్ మాజీల ఆగ్రహం
T20 World Cup 2022: అదృష్టం కలిసొచ్చి టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరిన పాకిస్తాన్.. నవంబర్ 9న న్యూజిలాండ్ తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి చెందిన సోషల్ మీడియా ఖాతాలు చేస్తున్న పని మాజీ క్రికెటర్లకు ఆగ్రహం తెప్పిస్తున్నది.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదీ దాగడం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా కంటే వేగంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే విషయమై పాకిస్తాన్ మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ లో ప్రతీ మ్యాచ్ తర్వాత ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలలో రిలీజ్ చేస్తున్న వీడియోలపై పాక్ మాజీలు వసీం అక్రమ్, వకార్ యూనిస్ లు పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా ప్రపంచం ముందు ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత, జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్నాక పాక్ డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ బాబర్ ఆజమ్, మెంటార్ మాథ్యూ హేడెన్ లు ఆ జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత కూడా బాబర్ ఆజమ్.. తమ జట్టు సెమీస్ కు చేరిన విధానం.. ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి మాట్లాడిన వీడియోను కూడా పీసీబీ తన ట్విటర్ ఖాతాలలో షేర్ చేసింది. దీనిపై అక్రమ్ మండిపడ్డాడు. అతడు మాట్లాడుతూ.. ‘నేను గనక బాబర్ ఆజమ్ ప్లేస్ లో ఉండి ఉంటే ఆ వీడియోలు తీసేవాడిని ఆపేవాడిని. డ్రెస్సింగ్ రూమ్ లో మనం మాట్లాడుకునే పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పెట్టాల్సిన పన్లేదు. ఒకవేళ అందుకు సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడుకునేప్పుడు పొరపాటున అవి లీక్ అయితే ఎలా..?
సోషల్ మీడియాలో తమ అభిమాన ఆటగాళ్లతో ఇంటరాక్ట్ అవడానికి ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉంటారు. దానిని మనం అర్థం చేసుకోగలం. కానీ దీనిని ఒక హద్దు ఉండాలి. నాకు తెలిసి మిగతా ఏ క్రికెట్ జట్టు కూడా డ్రెస్సింగ్ రూమ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం చాలా తక్కువ. ఫాలోవర్స్ ను పెంచుకోవడం వరకు నేను అంగీకరించగలను గానీ మరీ ప్రతీ విషయం సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు..’ అని ఎ స్పోర్ట్స్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో తెలిపాడు.
ఇదే విషయమై యూనిస్ మాట్లాడుతూ.. ‘వసీం భాయ్ ఏం చెప్పాడో నేను దానికి వంద శాతం అంగీకరిస్తా. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగింది రహస్యంగా ఉంచడమే బెటర్. ఇది ఇప్పుడే కాదు. గతంలో కూడా జరిగింది. దానివల్ల జట్టు సీక్రెట్స్ కూడా బట్టబయలవుతున్నాయి. టీమ్ రహస్యాలు ప్రత్యర్థులకు తెలుస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు లీక్ అవుతున్నాయి..’ అని చెప్పాడు. దీనిపై ఇప్పటికైనా పీసీబీ జాగ్రత్తగా వ్యవహరించాలని అక్రమ్, వకార్ సూచించారు.