కోల్ కతా: బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సంబంధించి గత అనుభవాన్ని హైదరాబాదీ మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమానికి లక్ష్మణ్ హాజరయ్యారు. 

క్యాబ్ జాయింట్ సెక్రటరీగా 2014లో గంగూలీ పనిచేస్తున్న సమయంలో లక్ష్మణ్ బెంగాల్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఇందులో భాగంగా ఆయన గంగూలీని కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో తనకు ఊహించని పరిణామం ఎదురైందని లక్ష్మణ్ అన్నారు. 

అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగి భారత క్రికెట్ ను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కెప్టెనే కాకుండా ప్రపంచ క్రికెట్ లో లెజెండ్ అయిన గంగూలీని ఆ గదిలో చూసి షాక్ తిన్నానని చెప్పారు. 

తాను బెంగాల్ బ్యాటింగ్ కన్సల్టెంట్ గా గంగూలీని కలవడానికి వెళ్లానని, ఆ సమయంలో రాష్ట్ర సంఘంలోని ఒక చిన్న గదిలో గంగూలీ కూర్చుని ఉన్నాడని, ఆ గది తనను షాక్ కు గురి చేసిందని లక్ష్మణ్ అన్నారు. అది చాలా చిన్న గది, అందులో కూర్చుని క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా గంగూలీ సేవలందిస్తున్నాడని ఆయన అన్నారు. 

అది తనకు ఊహించని విషయమని, దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యానని, అయితే అది తనలో స్ఫూర్తిని నిపిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ తో పాటుమరో హైదరాబాదీ అజరుద్దీన్ కూడా హాజరయ్యారు.