న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనాథ పిల్లల కోసం సీక్రెట్ శాంటా క్లాజ్ గా మారాడు. మైదానంలో దూకుడుగా ఉంటూ, ప్రత్యర్థులను తన హావభావాలతో కవ్వించే కోహ్లీ మైదానం వెలుపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. తాజాగా, అతను చిన్నారుల కోసం శాంటా క్లాజ్ తాతయ్యలా మారాడు.

క్రిస్మస్ పండుగకు ముందుగానే అతను చిన్నారుల అనాథాశ్రమానికి శాంటాక్లాజ్ వేషంలో వెళ్లాడు. వారికి బహుమతులు అందించాడు. చివరలో మీరంతా విరాట్ కోహ్లీని కలుసుకుంటార అని అడిగాడు. దానికి వారు అవునని సమాధానం ఇచ్చారు. 

కోహ్లీని మీకు చూపిస్తానంటూ గడ్డాన్ని, టోపీని తీసేశాడు. దీంతో పిల్లలు ఒక్కసారిగా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఆ తర్వత కరతాళ ధ్వనులతో, కేరింతలతో అతన్ని చుట్టుముట్టారు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలావుంటే, కటక్ లోని బారాబతి స్టేడియంలో వెస్టిండీస్ పై భారత్ నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఆడనుంది. తొలి మ్యాచులో విండీస్ విజయం సాధించగా, రెండో వన్డేను ఇండియాను గెలుచుకుంది.