జ్వరంతో బాధపడుతూ అద్భుత ఇన్నింగ్స్ ఆడావ్... నాకు నీవే స్ఫూర్తి అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసిన కోహ్లీ భార్య అనుష్క శర్మ.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి మూడు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, అహ్మదాబాద్ టెస్టులో అదిరిపోయే సెంచరీతో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 178.5 ఓవర్ వరకూ ఆడి ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉండి బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే కోహ్లీ డబుల్ సెంచరీ అందుకునేవాడే...

115 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, 60 ఓవర్లకు పైగా బంతులను ఎదుర్కొన్నాడు. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లతో 60 పరుగులు బౌండరీల రూపంలో వస్తే మిగిలిన 126 పరుగులు కూడా సింగిల్స్ రూపంలోనే వచ్చాయి. అదీకాకుండా శుబ్‌మన్ గిల్, కెఎస్ భరత్, అక్షర్ పటేల్‌తో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి విరాట్ కోహ్లీ... వారి కోసం మరో 100కి పైగా పరుగులు తీశాడు. అయితే విరాట్ కోహ్లీ ఇంత ఇన్నింగ్స్ ఆడింది జ్వరంతో అంటే నమ్మగలరా?.. 

364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ జ్వరంతో బాధపడుతున్నట్టు ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది ఆయన సతీమణి అనుష్క శర్మ...

‘జ్వరంలో కూడా ఇంత అంకితభావంతో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడావు... నువ్వు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నావ్... ’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది అనుష్క శర్మ. మూడున్నరేళ్లుగా టెస్టుల్లో సెంచరీ అందుకోని విరాట్ కోహ్లీ, 14 నెలలుగా 50 ప్లస్ స్కోరు కూడా చేయలేకపోయాడు...

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి వచ్చిన టెస్టు హాఫ్ సెంచరీ, సెంచరీ, 150+ స్కోరు ఇదే. మూడో రోజు ఆటలో వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు కనిపించిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీ అందుకోవడానికి 5 ఫోర్లు బాదాడు...

నాలుగో రోజు తొలి సెషన్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయిన విరాట్ కోహ్లీ, 241 బంతుల్లో 5 ఫోర్లతో సెంచరీ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇది 28వ సెంచరీ కాగా కెరీర్‌లో 75వ అంతర్జాతీయ సెంచరీ... 

విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇదో రెండో స్లోయెస్ట్ సెంచరీ. ఇంతకుముందు 2012లో నాగ్‌పూర్ టెస్టులో 289 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఈసారి 241 బంతులు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది 16వ సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా, కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు... 

2022, సెప్టెంబర్ 8న కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 2022 డిసెంబర్ 10న వన్డేల్లో సెంచరీ బాది 72వ అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు. మూడేళ్ల బ్రేక్ తర్వాత వచ్చిన వన్డే సెంచరీ అది... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో రెండు వన్డే సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ... 2023, మార్చి 12న తిరిగి టెస్టు సెంచరీ అందుకున్నాడు...