Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ చేసిన పనికి, దేశం మీదే గౌరవం పోయిందా విరాట్... మ్యాచ్‌కి ముందు కోహ్లీ ప్రవర్తనపై...

మూడో వన్డే ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో బబుల్ గమ్ నములుతూ కనిపించిన విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్...

Virat Kohli spotted chewing gum during national anthem in India vs South Africa 3rd ODI
Author
India, First Published Jan 23, 2022, 4:09 PM IST

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌ గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. గ్రౌండ్‌లో అగ్రెసివ్‌గా ఉండే విరాట్, కూల్‌గా శాంతంగా ఆలోచించడం, వ్యవహరించడం చాలా అరుదు. మిగిలిన ప్లేయర్లతో, తనను సెడ్జ్ చేసే ఆటగాళ్లతో, స్టేడియంలో గేలి చేసే ప్రేక్షకులతో దురుసుగా ప్రవర్తించినా... దేశభక్తి విషయంలో మాత్రం విరాట్ కోహ్లీకి ఇప్పటిదాకా ఎలాంటి బ్లాక్ మార్క్ పడలేదు...

మ్యాచ్ ఆరంభానికి ముందు వినిపించే జాతీయ గీతాన్ని ఆలపిస్తూ, తన కళ్లలోనే దేశం మీద తనకున్న గౌరవం కనిపించేది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం... ఆ తర్వాత అతన్ని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి...

టెస్టుల్లో అయినా కెప్టెన్‌గా కొనసాగుతాడులే... అనుకుంటున్న సమయంలో కేప్‌ టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుని, అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్టు సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకోవాలని బీసీసీఐ, విరాట్ కోహ్లీని హెచ్చరించిందని... తప్పుకోకపోతే వన్డేల్లో చేసినట్టే బలవంతంగా తప్పిస్తామని బెదిరించిందని వార్తలు వినిపించాయి...

సౌతాఫ్రికా టూర్‌కి ముందు విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో బీసీసీఐపై చేసిన వ్యాఖ్యలపై అతనికి షోకాజ్ నోటీసులు పంపాలని సౌరవ్ గంగూలీ అనుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ గంగూలీ స్వయంగా ప్రకటించాడు...

ఇవన్నీ సంఘటనలకు ముందు నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చారు టీమిండియా అభిమానులు. ముఖ్యంగా ఎమ్మెస్ ధోనీ ఫ్యాన్స్, విరాట్ కెప్టెన్సీలోని లోపాలను ఎత్తి చూపిస్తే, భారత జట్టు ఓటమిలకి అతన్నే బాధ్యుడిగా ట్రోల్ చేసేవాళ్లు...

ఇవన్నీ విరాట్ కోహ్లీని మానసికంగా కృంగిపోయేలా చేశాయని అంటున్నారు విశ్లేషకులు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌లో వచ్చిన మార్పు, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియాలో ఓ నామమాత్రపు ప్లేయర్‌గా చాలా నార్మల్‌గా ప్రవర్తిస్తున్న విరాట్ కోహ్లీ, మునుపటిలో ఆటలో కానీ, బ్యాటింగ్‌లో కానీ పూర్తిగా లీనం కావడం లేదు...

తాజాగా సౌతాఫ్రికాతో మూడో  వన్డే ఆరంభానికి ముందు భారత జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ బబుల్ గమ్ నములుతూ నిలబడడం చూసి సగటు క్రికెట్ అభిమాని ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఇంతకుముందు ఇలాంటి ప్రవర్తన కారణంగానే కశ్మీర్ ప్లేయర్ పర్వేజ్ రసూల్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది...

టీమిండియా క్రికెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా, భారత యూత్‌కి రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని అంటున్నారు అభిమానులు. 52 సెకన్లపాటు ఆలపించే జాతీయ గీతం వస్తున్నంత సేపు అయినా బబుల్ గమ్ నమలకుండా ఉండలేకపోయావా? అంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

జాతీయ గీతం ఆలపించకపోయినా, అది ప్లే అవుతున్నప్పుడు నిశ్శబ్దంగా నిల్చుంటే సరిపోతుంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ జట్టుతో, ఈ దేశంతోనే తనకేమీ సంబంధం లేనట్టుగా బబుల్ గమ్‌ ఎంజాయ్ చేయడమే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది..

బీసీసీఐ చేసిన రాజకీయాలతో తనకి చేసిన అవమానానికి, క్రికెట్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్‌కి దేశం మీద గౌరవం పోయిందా విరాట్... అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోహ్లీ వీరాభిమానులు... 

Follow Us:
Download App:
  • android
  • ios