సెంచరీ చేసి విరాట్ కోహ్లీ రనౌట్, ఆ వెంటనే రవీంద్ర జడేజా... భారీ స్కోరు దిశగా టీమిండియా...
రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసిన టీమిండియా.... సెంచరీ చేసి రనౌట్ అయిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరిన రవీంద్ర జడేజా..

ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 108 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది టీమిండియా. ఓవర్‌నైట్ స్కోర్ 288/4 స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి శుభారంభం అందించారు..
180 బంతుల్లో 10 ఫోర్లతో టెస్టుల్లో 29వ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. 2018, డిసెంబర్ 14న పెర్త్‌లో ఆస్ట్రేలియాపై టెస్టు సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 1676 రోజుల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ అందుకున్నాడు.. ఆసియా ఆవల విరాట్ కోహ్లీకి ఇది 13వ టెస్టు సెంచరీ. సచిన్ టెండూల్కర్ 18, సునీల్ గవాస్కర్ 15, రాహుల్ ద్రావిడ్ 14 ఓవర్ సీస్ టెస్టు సెంచరీలతో విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు.
ఇది విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా, ఇండియా- వెస్టిండీస్ మధ్య 100వ టెస్టు మ్యాచ్. 500వ మైలురాయి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ.
206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అల్జెరీ జోసఫ్ డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ రనౌట్ కావడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది రెండోసారి. ఇంతకుముందు 2014లో ధర్మశాలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 127 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.
నాన్ ఓపెనర్‌గా 25 వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, కుమార సంగర్కర తర్వాతి స్థానంలో నిలిచాడు. రికీ పాంటింగ్ 27,211 పరుగులు చేస్తే, కుమార సంగర్కర 26948 పరుగులు చేశాడు...
152 బంతుల్లో 5 ఫోర్లతో 19వ హాఫ్ సెంచరీ అందుకున్న రవీంద్ర జడేజా, కీమర్ రోచ్ బౌలింగ్‌లో జోషువా డి సిల్వకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండో టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్ అయ్యేదాకా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ బౌలర్లు వికెట్లు తీయలేకపోతే సెకండ్ సెషన్ ముగిసిన తర్వాత టీమిండియా స్కోరు 450+ స్కోరు దాటితే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.
2002లో ఇదే మైదానంలో సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 29వ టెస్టు సెంచరీ అందుకోగా 2023లో విరాట్ కోహ్లీ కూడా ఇదే మైదానంలో తన 29వ టెస్టు సెంచరీ అందుకోవడం కొసమెరుపు..