కరోనా వైరస్ కేసులు దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉన్నా... మనందరి కోసం పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు చెమడోస్తున్నారు. వారి శ్రమను మనం గుర్తించాలని సెలబ్రెటీలు చెబుతున్నారు. వారి జాబితాలో ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో క్రికెటర్ ఇశాంత్ శర్మలు కూడా చేరిపోయారు.

Also Read తొలిచూపు నుంచి ప్రేమ వరకు: మాక్స్ వెల్ కాబోయే భార్య విని రామన్ మాటల్లో...

కరోనా వైరస్ కట్టడి కోసం శ్రమిస్తున్న ఢిల్లీ పోలీసులపై విరాట్ కోహ్లీ, ఇశాంత్ శర్మలు ప్రశంసలు కురిపించారు. క్లిష్ట సమయంలో పేదలకి వారు చేస్తున్న సేవల్ని కొనియాడారు.  ప్రజలు  కూడా వారికి సహకరించాలని కోరారు. 

 

భారత్‌లో శనివారం ఉదయానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,600కి చేరుకోగా.. ఒక్క ఢిల్లీలోనే 903 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనల్ని తెరపైకి తెచ్చింది.

‘‘ఈ క్లిష్ట సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకి పోలీసులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయం. ముఖ్యంగా.. ఢిల్లీ పోలీసులు నిజాయితీగా వారి విధులు నిర్వర్తిస్తుండటమే కాకుండా.. ప్రతిరోజూ పేదలకి ఆహారాన్ని అందజేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ ఉండటంతో.. ఉపాధి కోల్పోయిన వారికి ఇప్పుడు భోజనం చాలా అవసరం. పోలీసులు వారిని ఆదుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు చాలా బాగా పని చేస్తున్నారు.. ఈ సేవల్ని ఇలానే కొనసాగించండి’’ అని కోహ్లీ ఓ వీడియో విడుదల చేశాడు. దీంతో.. ఢిల్లీ పోలీసులు కూడా స్పందించారు.

ఇదిలా ఉండగా.. కరోనా పై పోరాటానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రభుత్వానికి రూ.3కోట్లు విరాళంగా అందజేశారు. ఇద్దరూ స్వీయ నిర్భందలో ఉంటూ.. ప్రజలకు సోషల్ మీడియా ద్వారా దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.