విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచానికి ‘కింగ్’, ‘రన్ మెషిన్’. నేటి తరంలో బ్యాటుతో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీకి దక్కిన స్వాగతం చూసి, ప్రపంచ క్రికెట్ స్టార్లు ఆశ్చర్యపోయారు. తాజాగా విరాట్ కోహ్లీ ధరించిన గ్లవ్స్‌ని ఆస్ట్రేలియా మ్యూజియంలో చోటు దక్కింది.

2019 ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో 112 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీకి ఇది వన్డేల్లో 39వ సెంచరీ కాగా, చేధనలో 24వది.

ఆస్ట్రేలియాపై 11వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 131 పరుగులు చేయగా మ్యాక్స్‌వెల్ 48 పరుగులు చేశాడు. టీమిండియా 4 వికెట్లు కోల్పోయి ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని చేధించింది.

భారత సారథి విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా రోహిత శర్మ 43, మహేంద్ర సింగ్ ధోనీ 55 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ గుర్తుగా విరాట్ కోహ్లీ ధరించిన గ్లవ్స్‌ని ఆస్ట్రేలియా క్రికెట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచింది ఆసీస్.